వికారాబాద్, జూలై 5 : అనంతగిరిపల్లి సమీపంలోని గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట గురుకుల పాఠశాలలో సుమారు 580 మంది విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం ఉన్నట్లుండి సుమారు 40 మంది విద్యార్థులు ఒకే సారి అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కొందరు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు దవాఖానకు తరలించారు.
కాగా, కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్లకు తలుపులు లేవని, పారిశుధ్య సమస్యలు కూడా తీవ్ర ఉన్నాయని వివరించారు. ఉన్నతాధికారులు పాఠశాలలో తనిఖీలు చేపట్టి, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్ తదితరులు పరామర్శించారు.