‘జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.. ప్రధానమైన కాగ్నా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు..’ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాలాల, తాండూరు మండలాల్లోనే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లలో కాగ్నా నుంచి ఇసుకను రాత్రంతా అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాలాల మండలంలోని కాగ్నా నుంచి 40 ట్రాక్టర్లతో, తాండూరు మండలంలోని ఖంజాపూర్, పాత తాండూరు ప్రాంతాల నుంచి సుమారు 20 ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఏకంగా పోలీసులే దగ్గరుండి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.3 నుంచి 4 వేలు వసూలు చేస్తూ దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే అండగా ఉండడంపై జిల్లావాసులు భగ్గుమంటున్నారు. నిఘా పెట్టి అడ్డుకోవాల్సిన గనులు, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో ఉండి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అండతోనే ఇసుక దందా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
– వికారాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, యాలాల మండలంతోపాటు తాండూరు, బషీరాబాద్, ధారూరు మండలాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని జిల్లావాసులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి రాత్రికిరాత్రే ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలంలోని కాగ్నా పరీవాహక ప్రాంతంతోపాటు శివసాగర్‌లో ఇసుక వనరులు ఉండగా, ఏటా రూ.కోట్ల ఇసుక లభ్యమవుతున్నట్లు సమాచారం. జిల్లాలోని కొడంగల్, బొంరాస్‌పేట మండలాల్లో ఫిల్టర్ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నదని, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు నెలనెలా మామూళ్ల మత్తులో మునుగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బషీరాబాద్ మండలం కాగ్నా పరీవాహక ప్రాంతంలోని మంతటి, రెడ్డి ఘణాపూర్, ఎక్మయి, మైల్వార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక దందా సాగుతున్నదని, ఇసుక మాఫియాపై నిఘా పెట్టాల్సిన అధికారులు అండగా నిలువడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పేరిట యథేచ్ఛగా ఇసుక దందా సాగుతుండగా తాండూరులో నర్సింగ్ కాలేజీ, తాండూరు మార్కెట్ కమిటీ గోదాంల నిర్మాణానికి అనుమతులు పొందిన వారు వాటి పేరుపై రాత్రి సమయాల్లోనూ ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అండతోనే ఇసుక దందా సాగుతున్నదని, దీంతో పోలీసు, మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలో ఇసుక అక్రమ దందా సాగుతున్నట్లు పత్రికల్లో చూశా. మేం ఇప్పటి వరకు ఎక్కడా తనిఖీలు నిర్వహించలేదు. మాకు వేరే పనులున్నాయి.. ఇసుక మాఫి యాపై ఎలా నిఘా పెడుతాం.. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే చర్యలు తీసుకుంటాం.
– సత్యనారాయణ, గనుల శాఖ ఏడీ