వికారాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద్ మండలాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లలో కాగ్నా నుంచి ఇసుక తరలిపోతున్నది. తాండూరు మండలంలోని ఖంజాపూర్, చంద్రవంచ ప్రాంతాల నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు.
ఇసుక తరలింపుపై నిఘా పెట్టి అడ్డుకోవాల్సిన గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్లతో చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. వారం క్రితం జిల్లాలోని బషీరాబాద్ మండలంలో అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకునేందుకు వెళ్లిన పోలీస్ వాహనాన్ని ఇసుక మాఫియా ట్రాక్టర్‌తో ఢీకొట్టిన విషయం జిల్లా అంతటా చర్చానీయాంశంగా మారింది. పోలీస్ వాహనాన్నే ఇసుక మాఫియా ఢీకొట్టిందంటే ఏ విధంగా బరి తెగిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. జిల్లా గనుల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరితో అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అండతోనే అక్రమంగా ఇసుక దందా జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జోరుగా అక్రమ ఇసుక దందా
జిల్లాలోని యాలాల, తాండూడు, బషీరాబాద్ మండలంలోని కాగ్నా పరీవాహక ప్రాంతంలో అధిక మొత్తంలో ఇసుక వనరులున్నాయి. సంబంధిత ప్రాంతాల నుంచి ప్రతి ఏటా రూ.కోట్ల విలువైన ఇసుక లభ్యమవుతుంది. అదేవిధంగా కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల్లో ఫిల్టర్ ఇసుక అక్రమ వ్యాపారం కూడా జోరుగు జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నెలనెలా మామూళ్లు తీసుకుంటూ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాలాల మండలంలోని కాగ్నా పరీవాహక ప్రాంత పరిధిలోని విశ్వనాథపూర్, అగ్గనూర్ తదితర ప్రాంతాల నుంచి., తాండూరు మండలంలోని చంద్రవంచ, ఖంజాపూర్ గ్రామాల పరిధి నుంచి., బషీరాబాద్ మండలం యాద్గిరా, గంగ్వార్, జీవన్గి, మంతటి, రెడ్డి ఘణాపూర్, ఎక్మయి, మైల్వార్ ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తరలించేందుకు అనుమతులు పొంది, రాత్రి వేళల్లో యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి సంబంధిత అధికారులు ఇసుక మాఫియాకు అండగా ఉంటూ ఇసుకను తరలించడంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తున్నట్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి పనుల పేరిట..
పేరుకు కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు అని చెప్తున్నప్పటికీ వాస్తవానికి తాండూరు, ధారూరు, పెద్దేముల్ మండలాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అడ్డుకుంటే స్పీకర్ పేరు చెబుతూ పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొడుతున్నారు. మార్చి 31తో కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతు పనులకు ఇసుక తరలింపు గడువు ముగిసినప్పటికీ ఇంకా అక్రమంగా తరలిస్తుండటం గమనార్హం. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల అండతోనే ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫియాను స్థానిక పోలీసు, మైన్స్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేయడంతోపాటు తరలిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వారం, పది రోజుల్లో అదే వ్యక్తులు మళ్లీ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటే ఏ స్థాయిలో ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల ఇసుక మాఫియా ఆగడాలు