కొత్తూరు, జనవరి 11 : కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్ హైవే 44పై ఆక్రమణలను బుధవారం తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌హెచ్ 44పై బావర్చి హోటల్ పరిసర ప్రాంతాల్లో హైవే పక్కల ఉన్న షాపులు, హోటళ్ల ఎదుట అక్రమంగా హోర్డింగులు, పాన్ షాపులు, జ్యూస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ సీఐ శ్రీశైలం కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ కొత్తూరు సీఐ బాల్‌రాజు ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా షాపు యజమానులు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. కనీసం సమాచారం ఇవ్వకుండా తమ షాపులను ఎలా తొలగిస్తారని వారు కమిషనర్‌ను అడిగారు. రెండు వారాలుగా చెప్తున్నా ఎవరూ వినడంలేదని అందుకే తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
కొత్తూరు మున్సిపాలిటీలో ఎవరైనా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని కమిషనర్ వీరేందర్ హెచ్చరించారు. నేషనల్ హైవే 44పై రోడ్డును ఆక్రమించి హోర్డింగ్‌లు, ఇతర షాపులు ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.