Nagaram | కీసర, మార్చి 12 : జోరుగా బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు కళ్లు మూసుకుంటున్న వైనం నాగారం మున్సిపల్ పరిధిలోని గోధుమకుంట వార్డు కార్యాలయంలో కొనసాగుతుంది. గోధుమకుంటలోని ఎలిఫెంట్ కాలనీ పక్కనే బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు బఫర్ జోన్లో అక్రమంగా పర్మిషన్లు తీసుకొని అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలను సాగిస్తున్నారు.
ప్రభుత్వానికి భారీ ఎత్తున్న గండి కొడుతున్న.. అధికారులు చేతులు దులుపుకుంటున్న వైనం నెలకొంటుంది. అధికారులు జేబులు నిండిందే చూస్తున్నారు తప్ప అక్రమ నిర్మాణాలను అడ్డు కట్ట వేద్దామని ఆలోచన రానివ్వడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద గోధుమకుంటకు చెందిన కొంతమంది నేతలు అధికారులకు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాధులు చేసిన పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో అధికారుల పనితీరు మీద ధ్వజమెత్తుతున్నారు. బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చి అధికారులు చేతినిండా డబ్బులు సంపాదిస్తున్నారు. బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు సాగించడంతో హైడ్రా అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని గోధుమకుంటకు చెందిన స్థానికులు హెచ్చరిస్తున్నారు.
గోధుమకుంటలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. చట్ట పరంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా అక్రమార్కులు ఎంతటి వారైనా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ నిర్మాణాల దగ్గరికి టౌన్ ప్లానింగ్ అధికారిని పంపిస్తామని తెలిపారు. అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయం మీద పూర్తి వివరాలు తీసుకొని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.