Malreddy Ranga Reddy | రంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని సూచించారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారిని గౌరవించాలని కానీ పదవులు ఇవ్వద్దని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే తాను రాజీనామా చేయటానికి కూడా సిద్దమని మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో కులమే అడ్డు వస్తే బీసీలో ఏ నాయకుని పేరు చెప్పినా తీసుకెళ్లి ఇబ్రహీంపట్నం నుంచి గెలిపించి తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలోనే 41శాతం ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వచ్చే గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌లో మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 40శాతానికి పైగా ఉన్న గ్రేటర్ పరిధిలో 6 వరకు మంత్రి పదవులుండేవని తెలిపారు. త్వరలోనే గ్రేటర్లో ఎన్నికలు కూడా రానున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండటమే తమ అభిమతమని అన్నారు. పార్టీ లైన్ దాటవద్దని తాను అన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని, అధికారంలో లేనప్పుడు పార్టీకి కార్యకర్తలకు అండగా ఉన్న నాయకులకు గుర్తింపు ఇవ్వాలని ఆయన సూచించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని, కాని, అలాంటి వారికి పదవులు ఇవొద్దని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావడానికి అధిష్ఠానం చొరవ చూపాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు.
మంత్రి పదవికి తన కులమే అడ్డువస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. ఆ స్థానం నుంచి ఏ బీసీని చూపించినా గెలిపించి అదిష్ఠానం ముందు ఉంచుతానని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఎలాగైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం ఎంతోమంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మంత్రి పదవి లేకపోవటం వలన అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి అవకాశం లేకుండా పోతుందన్నారు.