నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు.
క్యూఆర్ కోడ్‌తో నేరుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం ఈజీగా మారనుంది. ఒకవేళ పేపర్ లీక్ అయినప్పటికీ ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చిందో తెలుసుకునేందుకు వీలుగా ‘ప్రశ్నాపత్రం మీద క్యూర్ కోడ్’ ముద్రించారు. ఆధునిక సాంకేతికతను అప్డేట్ చేసిన అధికారులు పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అలాగే కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.