వికారాబాద్, నవంబర్ 13, (నమస్తే తెలంగాణ): ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకుగాను లగచర్ల వెళ్లిన అధికారులపై రైతులు ఎదురుతిరిగిన ఘటనలో హైడ్రామా నడుస్తున్నది.. అరెస్టుల పరంపర కొనసాగుతుండగా రాత్రికిరాత్రే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ వ్యూహాలు పన్నుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మాకు వ్యతిరేకంగా, బాధిత రైతులకు అండగా ఉన్నందుకు మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులతో బెదిరించడం సబబు కాదని వారు వాపోతున్నారు.
పోలీసులు నిందితుడిగా ప్రచారం చేస్తున్న సురేశ్ కూడా ఫార్మా బాధితుడేనని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. కాలుష్యాన్ని వెదజల్లే ఫార్మా పరిశ్రమలు తెస్తామనడం, అరకొర పరిహారం ఇస్తామనడంతోనే వివాదం తలెత్తిందని గ్రామస్తులు చెబుతున్నారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని సమస్య పరిష్కరించాలేగాని రాజకీయం చేయవద్దని వారు కోరుతున్నారు. అయితే ఇప్పటికే 16 మంది రైతులను రిమాండ్ చేసిన పోలీసులు బుధవారం మరో నలుగురు రైతులకు పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్‌కు తరలించడంతోపాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Rr4
ఉదయం నుంచి ఉత్కంఠ..
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రానికి తీసుకువచ్చిన పోలీసులు, ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 4 గంటలపాటు పట్నం నరేందర్ రెడ్డిని విచారించారు. విచారణ అనంతరం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు, తదనంతరం కొడంగల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కొడంగల్ కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపర్చగా, కోర్టు 14 రోజులపాటు రిమాండ్‌ను విధించింది. ఈ మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు నుంచి చర్లపల్లి జైలుకు తరలిస్తున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో మొదట ఏ1గా బోగమోని సురేశ్ పేరును చేర్చిన పోలీసులు తదనంతరం పట్నం నరేందర్ రెడ్డిని ఏ1గా పేర్కొన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో 47 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు..ఏ2గా ఉన్న బోగమోని సురేశ్‌తోపాటు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డీటీసీకి తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్ రెడ్డిలతోపాటు వికారాబాద్, పరిగి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్ రెడ్డిలు డీటీసీలో పోలీసుల అదుపులో ఉన్న నరేందర్ రెడ్డిని కలిసి ధైర్యం చెప్పి పరామర్శించారు.