HYDRAA | ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27 : రెక్కాడితే గాని డొక్క నిండని బడుగు జీవులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర బస్తీలో ఇండ్లు కట్టుకుని 30 ఏండ్లుగా నివాసముంటున్నారు. ఇందిరమ్మ కాలనీగా నామకరణం చేసుకోవడంతో కొంతమందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లనూ కేటాయించింది. నాలుగు రోజుల కింద హైడ్రా అధికారులు వచ్చి కాలనీ మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని, ఇండ్లను కూల్చివేస్తామని చెప్పారు. దీంతో ఆ కాలనీవాసులు పనులకు వెళ్లకుండా క్షణం..క్షణం భయం..భయంగా ఇండ్ల మధ్యనే ఉంటున్నారు. కాలనీలోకి ఏ కొత్త కారు వచ్చినా.. ఏ కొత్త మనిషి వచ్చినా భయపడుతున్నారు. ఇందిరానగర్‌లో సుమారు 70 కుటుంబాలకు చెందిన వడ్డెర వాళ్లు ఇక్కడ స్థిర నివాసముంటున్నారు. రాళ్లు, కంకరకొట్టి విక్రయించుకుని జీవనం సాగిస్తున్నారు. రూపాయి.. రూపాయి పోగు చేసుకుని కట్టుకున్న ఇండ్లను నేల మట్టం చేస్తామని అధికారులు చెప్పడంతో బిక్కుబిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు 100 నుంచి 150 గజాల స్థలాలను కొనుగోలు చేసుకున్నారు. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ప్రభుత్వం రుణాలను సైతం ఇచ్చింది. సాఫీగా సాగుతున్న వీరి జీవితాల్లో ఒక్కసారిగా హైడ్రా భయం వణుకు పుట్టిస్తున్నది.
ఈనెల 22న హైడ్రా అధికారులు, ఇరిగేషన్, పోలీసు అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, చిన్న చెరువు సమీపంలోని ఎన్కే గార్డెన్, పరిసరాల్లో ఉన్న ఇండ్లు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయని గుర్తించారు. చిన్నచెరువులో ఎఫ్టీఎల్ లోపల నిర్మించిన ఇండ్లను గుర్తించి వాటిని ఖాళీ చేయాల్సిందిగా ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చిన్నచెరువు సమీపంలో సుమారు 50 నుంచి 60, పెద్ద చెరువు సమీపంలో ఇందిరమ్మ కాలనీలో 70 ఇండ్లను కూల్చివేస్తామని అధికారులు చెప్పారు. దీంతో వారం రోజులుగా కాలనీవాసులు ఇండ్ల వద్దే ఉంటూ తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై చర్చించుకుంటున్నారు. తాము, తమ పిల్లలు ఆగమవుతామని ఇండ్లను కూల్చివేయవద్దని వేడుకుంటున్నారు.
నగరానికే పరిమితమైన హైడ్రా మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువుతో పాటు తుర్కయాంజాల్ మాసబ్చెరువుపై దృష్టి సారించింది. ఈ చెరువుల్లో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని గుర్తించారు. అందులో భాగంగానే ఈ రెండు చెరువుల్లో ఇరిగేషన్, హైడ్రా, పోలీసు అధికారులు క్షుణంగా పరిశీలించారు. ఆక్రమణల లోపల ఎన్ని ఇండ్లు ఉన్నాయనేదానిపై నివేదిక తయారు చేశారు. దసరా తర్వాత నిర్మాణాలను కూల్చివేసే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
నా వయస్సు 70 ఏండ్లు.. 30 ఏండ్ల కింద ఇల్లు కట్టుకుని ఉంటున్నా. తాను.. తన పిల్లలు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు నిర్మించుకున్నా. ఈనెల 22న కొంతమంది సర్కారు పెద్దసార్లు వచ్చి మా ఇల్లు చెరువులో ఉన్నదని, కూల్చివేస్తామని చెప్పారు. ఇప్పటివరకు మా ఇండ్లలోకి చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవు. మాలాంటి బడుగు జీవులను బాధపెట్టొద్దు.
– వెంకటయ్య, వడ్డెర బస్తీ
గత ఐదు రోజులుగా నిద్రపడ్తలేదు. తిందామంటే తినబుద్ధ్ది ఐతలేదు. ఐదురోజుల కింద పెద్దపెద్ద కార్లల్ల పెద్దొళ్లు వచ్చి మా కాలనీల తిరిగిండ్రు. 30 ఏండ్ల కింద ఇక్కడ ఇల్లు కట్టుకున్నం. కాయ కష్టం చేసుకుని బతుకుతున్నాం. ఇల్లు కూలగొడితే మేము ఏడ బతకాలె. మాలాంటి పేదోళ్ల కడుపు కొట్టొద్దు రేవంత్సారు.. మీకు పుణ్యముంటది.
– నర్సమ్మ, వడ్డెర బస్తీ
కాయ కష్టం చేసి జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని.. ఇండ్లు కట్టుకున్న పేదల పొట్టమీద కొట్టొద్దు. పెద్దచెరువు పూర్తిగా నిండినా ఈ కాలనీలోకి నీరు రాదు. రెక్కాడితే, డొక్కాడని బడుగుల ఇండ్లు కూల్చిస్తే సహించేది లేదు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలను మరిచి వారి జీవితాలతో ఆడుకోవడం సరైన పద్ధతి కాదు.
– మైలారం విజయ్‌కుమార్, ఇబ్రహీంపట్నం