షాబాద్, ఫిబ్రవరి 27 : గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్నవారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,054 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,808 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,584 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. పరీక్షలు చేయించుకున్నవారి వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు.
155 గ్రామాలు, 37 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాలలో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 5260 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 883 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 766 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 155 గ్రామాలు, 37 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కంటి వెలుగు అభినందనీయం : గవ్వల అమృత, చేవెళ్ల
సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేయడం అభినందనీయం. పేదలు, మధ్య తరగతి వారికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతున్నది. గ్రామంలో వైద్యులు కంటి పరీక్షలు ఉచితంగా మందులు, అద్దాలు ఇస్తున్నారు. ప్రైవేటు దవాఖానలకు వెళ్లలేక కంటి పరీక్షలు చేయించుకోకుండా ఉన్న చూపుతోనే సర్దుకుపోయేవారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
అద్దాలు ఇచ్చారు
– బి.సత్తయ్యగౌడ్, తంగడిపల్లి, చేవెళ్ల మండలం
చాలా రోజుల నుంచి నా కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. చూపించుకోవాలని అనుకున్నా. ఇంతలోనే మా గ్రామంలో ప్రభుత్వం కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేశారని తెలిసింది. దూరం వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.