Heavy Rain | తుర్కయంజాల్, ఏప్రిల్ 19 : తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గాలివాన భీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల చెట్లు, వాటి కొమ్మలు విరిగిపడ్డాయి. సంఘీనగర్ ఉమర్ఖాన్గూడలో గాలివాన దుమారానికి చెట్లు విరిగి ఇళ్లపై పడిపోయాయి. అంతేగాక గాలివానకు ఇళ్ల రేకులు గాలికి కొట్టుకుపోవడంతో నిత్యావసర సరుకులు పూర్తిగా తడిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనల్లో ఎవరికీ ప్రమాదం సంభవించకపోవడంతో ప్రజలు ఉపీరి పిల్చుకున్నారు. గాలివాన భీభత్సానికి దెబ్బతిన్న ఇళ్ల యజమానులకు ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించడంతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.