Hyderabad | సిటీబ్యూరో: ఒకప్పుడు సొంత నిధులతో ప్రాజెక్టులు చేపట్టిన పరిస్థితి. అంతేకాదు.. కొత్త ప్రాజెక్టులకు ఇతర శాఖలకు నిధులను సమకూర్చిన ఘనత. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో.. సొంత ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్ఎండీఏ నిధులను అన్వేషిస్తోంది. ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించాలంటే ఆర్థిక వనరులు అడ్డు తగులుతున్నాయి. దీంతో హెచ్ఎండీఏ చేపట్టిన భారీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇక ప్రభుత్వం నిధులిచ్చే పరిస్థితి లేకపోవడంతో.. రూ. 20వేల కోట్ల నిధులను అప్పుల రూపంలో సేకరించేందుకు సిద్ధమవుతున్నది.
ఇటీవల కాలంలో హెచ్ఎండీఏకు వచ్చే ప్రధాన ఆదాయ మార్గాలైన భవన నిర్మాణ అనుమతులు. వీటి ద్వారా మెజార్టీ రెవెన్యూ సమకూరేది. ప్లానింగ్ విభాగం సేకరించే నిధులకు అదనంగా భూముల వేలం, డెవలప్మెంటల్ యాక్టివిటీతో హెచ్ఎండీఏ ఖజానా నిండేది. కానీ పరిస్థితి తలకిందులైంది. వచ్చే ఆదాయం ఏకంగా 50 శాతానికి తగ్గింది. దీంతో నెలవారీ నిర్వహణ, జీతభత్యాలు మినహా కొత్త ప్రాజెక్టులను చేపట్టాలంటే గల్లపెట్టే ఖాళీగా ఉంది. ముఖ్యంగా ప్రతిపాదిత ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకు రాలేకపోతున్నారు.
మైనర్ పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నా.. నిధుల కొరతతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టే అవకాశం లేక అప్పులు కోసం హెచ్ఎండీఏ సిద్ధమవుతున్నది.ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంగా గుర్తించే స్థాయిలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టలేదు. కనీసం శంకుస్థాపన చేసిన రెండు ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా ఇప్పటివరకు పట్టాలెక్కించలేదు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం భూసేకరణతో కలిపి మొత్తం రూ. 10వేల కోట్లు దాటుతుండగా.. మరో రూ. 10 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇప్పటికే ఎప్పుడో అందుబాటులోకి రావాల్సిన కొత్వాల్‌గూడ ఎకో పార్క్ నిధుల్లేక పనులు ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. మరోవైపు మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం అంటూ హడావుడి చేసినా.. ఇంక పనులే మొదలు కాలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ఫోర్త్ సిటీ, రీజినల్ రింగు రోడ్డును అనుసంధానం చేసే గ్రీన్‌ఫీల్డ్ హైవేలకు అదనంగా సుమారు మరో రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తే గానీ ప్రాజెక్టు పూర్తి చేసే పరిస్థితి లేదు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిందనే వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పాలనపరమైన విధానాలు అమ్మకాలు పడిపోయాయి. కానీ హెచ్ఎండీఏ పరిధిలో అనుమతులు జోరుగా సాగుతున్నాయని, గతేడాది కంటే ఎక్కువ శాతం అనుమతులు ఇస్తున్నామని, రెవెన్యూ కూడా పెరిగిందంటూ సర్కారు వ్యాఖ్యానించింది. కానీ ప్రాజెక్టులను చేపట్టేందుకు నిధులు లేక అప్పుల కోసం సిద్ధం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నిజానికి గడిచిన పదేండ్లలో హెచ్ఎండీఏ నిధుల కోసం ఏనాడూ అప్పుల కోసం చేయి చాపలేదు. ట్యాంక్ బండ్ సుందరీకరణ, కొత్వాల్‌గూడ ఎకో పార్క్, ఓఆర్ఆర్ వెంబడి సైకిల్ ట్రాక్, రేడియల్, లింకు రోడ్ల నిర్మాణం, వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో కోకాపేట లే అవుట్ అభివృద్ధి వంటి అనే ప్రాజెక్టులను చేపట్టింది. పదేండ్లలో ఏకంగా రూ. 15వేల కోట్లకు పైగా నిధులను హెచ్ఎండీఏ ఖర్చు చేసి ప్రాజెక్టులను చేపట్టింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు రూ. 450 కోట్లు నిధులను హెచ్ఎంఆర్ఎల్కు సమకూర్చేంత స్థాయిలో ముందుకు సాగింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కొత్త ప్రాజెక్టులను చేపట్టలేక నిధుల కోసం అప్పులు చేసే పరిస్థితికి హెచ్ఎండీఏ దిగజారింది.