వికారాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో ఇటీవల మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లో అపార పంట నష్టం జరిగింది. ప్రధానంగా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ ఉప్పొంగి ప్రవహించడంతో వరద ధాటికి పంటలు కొట్టుకుపోయిన పరిస్థితులున్నాయి. మరో నెల రోజులైతే పత్తి ఏరేందుకు సిద్ధమయ్యే సమయంలో అల్పపీడనం రైతులను పూర్తిగా నష్టాల్లో ముంచెత్తింది. జిల్లావ్యాప్తంగా ఎక్కువగా పత్తి పంటనే వరద నీటికి కొట్టుకుపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగ్నా పరివాహక ప్రాంతమైన పెద్దేముల్, తాండూరు తదితర మండలాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మూసీ పరివాహక ప్రాంతంలోనూ పత్తి, కూరగాయల పంటలకు నష్టం జరిగింది. మర్పల్లి మండలంలోని ఒకే గ్రామంలో 1000 ఎకరాల వరకు పంట పొలాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో మోమిన్‌పేట మండలంలో 131 మి.మీ., నవాబుపేట మండలంలో 112 మి.మీ., బంట్వారం మండలంలో 107.1 మి.మీ. వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు నీట మునగడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు నెలరోజుల క్రితం కూడా భారీ వర్షాలకు పంట నష్టం జరిగినా.. ఇప్పటివరకు రైతులకు నయాపైసా నష్టపరిహారం అందజేయలేదు.
6307 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం
జిల్లాలో సెప్టెంబర్ 26 నుంచి 29 వరకు అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా 15 వేల ఎకరాలపైనే ఆయా పంటలకు నష్టం వాటిల్లింది. అయితే అధికారికంగా 6307 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేశారు. ఎక్కువగా పెద్దేముల్ , వికారాబాద్, దౌల్తాబాద్, కోట్‌పల్లి, మర్పల్లి, తాండూరు, ధారూరు, పూడూరు, పరిగి, నవాబుపేట మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన పంటల్లో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలే ఉన్నాయి. భారీ వర్షాలతో సుమారు 5 వేల మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. అత్యధికంగా బంట్వారం మండలంలోని బంట్వారం, మాలసోమారం, యాచారం, నాగారం, రొంపల్లి, మాధవపూర్, సల్బత్తాపూర్, బొపునారం, తొర్మామిడి గ్రామాల్లో కేవలం పత్తి పంట 1070 ఎకరాల్లో నష్టం జరిగింది.
జిల్లాలోని పరిగి, దోమ, తాండూరు, వికారాబాద్, పూడూరు, దుద్యాల, కొడంగల్, చౌడాపూర్, కులకచర్ల మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురువడంతో రైతులు పంటలను నష్టపోయారు. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు కూడా జిల్లాలో పంట నష్టం జరిగింది. జిల్లావ్యాప్తంగా 505 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ వర్షాలతో సుమారు 300 మంది రైతులు తమ పంటలను నష్టపోయారు.
పత్తి పంట 87 మంది రైతులకు సంబంధించిన 147 ఎకరాలు, మొక్కజొన్న 49 మంది రైతులకు సంబంధించిన 111 ఎకరాల్లో, వరి పంటకు సంబంధించి 38 మంది రైతులకు సంబంధించిన 97 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పసుపుతోపాటు కూరగాయలకు సంబంధించి 150 ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా సుమారు 150 ఎకరాల్లో ఉద్యానవన పంటలు నష్టపోగా, పసుపు 50 ఎకరాల్లో నష్టపోగా, మిగతా 100 ఎకరాల్లో ఆయా కూరగాయాల పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యానవన పంటల్లో అధికంగా ధారూరు, పరిగి, దోమ, పూడూరు, వికారాబాద్ మండలాల్లో పంట నష్టం జరిగింది.
ప్రభుత్వానికి రైతు గోస పట్టదా..?
తాండూరు : నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని 149 గ్రామపంచాయతీల్లో పత్తి, కంది, మొక్కజొన్న, సోయాబీన్, వరి పంటలతో పాటు పలు కాయగూరల తోటలు రైతులు సాగుచేస్తున్నారు. అకాల వర్షాలతో ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిని కర్షకుడికి కన్నీళ్లను మిగిల్చాయి. పంట చేతికి వస్తుందన్న సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించడంతో పత్తి, కంది పంట చేనులోనే చెడిపోయింది.
పత్తి చేలల్లో వచ్చిన కాత అధిక వర్షం కారణంగా కాయలు మక్కిపోయి ఊడి కిందపడుతున్నాయి. పాడైన పంటలను పరిశీలించడానికి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితోపాటు స్థానికంగా ఉన్న ఏ ఒక్క అధికారి, నేతలకూ సమయం లేదా..? అసలు ప్రభుత్వానికి రైతు గోస పట్టదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన పంటల సర్వే చేపట్టి ఎకరాకు రూ.20 వేల నష్టపరిహారం అందించాలని తాండూరు నియోజకవర్గ రైతులు డిమాండ్ చేస్తున్నారు.