ధారూరు, అక్టోబర్ 5 : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోట్పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, నాగారం-మైలారం గ్రామాల మధ్య ఉన్న కాగ్నానది వాగు కూడా అధికంగా వెళ్తుండడంతో అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ధర్మాపూర్-కొండాపూర్కలాన్ గ్రామాల మధ్య ఉన్న వంతెనపై నీళ్లు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు కూ డా చాలావరకు దెబ్బతిన్నాయి. మండలంలోని అంతా రం, మోమిన్కలాన్, రాజాపూర్, నాగారం, గురుదొట్ల, మోమిన్ఖుర్దు, దోర్నాల్ తదితర గ్రామాల్లో పంట పొలా లు భారీగా దెబ్బతిన్నాయి.
బషీరాబాద్ : మండలంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో వాగులు, కుంటలు పొంగిపొర్లా యి. పంట పొలాలు నీట మునిగాయి. జిల్లాలోనే మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మైల్వార్-బషీరాబాద్ మార్గంలో ఉన్న మేకల వాగు రోడ్డుపై నుంచి ప్రవహించింది. అలాగే, జీవన్గి-బషీరాబాద్ మా ర్గంలో ఉన్న మల్లన్న వాగు రోడ్డుపై నుంచి పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అటు వర్షం అన్నదాతకు తీవ్రంగా నష్టం చేసింది. పత్తి, కంది, మినుము పంటలు పాడైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కాశీంపూర్ గ్రామంలో 71.8 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా.. మండల కేంద్రంలో 69.3 వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతా ల్లో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో నాగసముందర్- రుద్రారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, వాగులు, కుంటలు పొంగి పంట పొలాలు మునిగిపోయాయి. అదే విధంగా వికారాబాద్ మండలంలోని గొట్టిముక్కల, ధ్యాచారం, ధన్నారం తదితర ప్రాంతాల్లో ఉన్న వాగులు రోడ్లపై నుంచి పారాయి. కాగా, బషీరాబాద్ మండలంలో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఆదివారం ఉదయం కురిసిన వాన కౌలు రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మొక్కజొన్న పంటను రెండో రోజుల్లో విక్రయిద్దామని..రోడ్డుపై ఆరబెట్టగా ఒక్కసారిగా కురిసిన వానతో ఆ పంటంతా నీటి పాలైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల పంచాయతీ పరిధిలోని బాల్యాతండాలో జరిగింది.
కేశంపేట : అప్పులు చేసి పంటను సాగు చేసిన రైతన్న ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. రెండు రోజుల్లో ఆ పంటను విక్రయించి చేసిన అప్పు తీర్చొచ్చని భావించాడు. నాలుగు ట్రాక్టర్లకుపైగా మొక్కజొన్నను తేమ శాతం ఉండొద్దనే ఉద్దేశంతో రోడ్డుపై ఆరబెట్టగా ఒక్కసారిగా కురిసిన వానకు కొట్టుకు పోయింది. ఈ ఘటన మండలంలోని తొమ్మిదిరేకుల పంచాయతీ పరిధిలోని బాల్యాతండాలో జరిగింది. తండాలోని అంబ్యానాయక్ తన కుమారుడు రవీనాయక్తో కలిసి 12 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంటను సాగు చేశాడు. నాలుగు ట్రాక్టర్లకుపైగా ఉన్న మొక్కజొన్నను తేమ శాతం ఉండొద్దనే ఉద్దేశంతో ఆదివారం రోడ్డుపై ఆరబెట్టగా ఒక్కసారిగా కురిసిన వానకు ఆ పంట అంతా కొట్టుకుపోయిందని, రూ.లక్ష వరకు నష్టం జరిగిందని అంబ్యానాయక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పంటను విక్రయిద్దామనుకునే లోపే వరద నీటిలో కొట్టుకుపోవ డంతో పలువురు నేతలు, రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి ప్రారంభమై ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. మండలంలోని గొట్టిముక్కల, ధ్యాచారం, ధన్నారం తదితర వాగులు రోడ్లపై నుంచి ఉధృతంగా పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, కంది, మొక్కజొన్న తదితర పంటల్లో నీరు నిలవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.