జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వర్షం వెలియగానే..చెరువుల్లో నీరు సైతం ఖాళీ అయింది. వచ్చిన వరద వచ్చినట్లుగానే దిగువకు వెళ్లిపోయింది. జిల్లాలో 2,090 చెరువులుండగా .. కేవలం 173 తటాకాలు మాత్రమే ఇటీవలి వర్షాలకు అలుగు పోశాయి. పూర్తిస్థాయి నీటి మట్టంతో ఉన్నవి కేవలం 161 చెరువులు మాత్రమే. 654 చెరువుల్లో నీటి నిల్వలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. వచ్చిన వరదతో సాగుకు ఢోకా ఉండదనుకున్న రైతాంగం ఆశ లు కొద్ది రోజులకే ఆవిరయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగును మొదలుపెట్టిన జిల్లా రైతులకు అన్నీ ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)
అంతరించిపోతున్న జల వనరులను మళ్లీ పునరుద్ధరించాలన్న సదుద్దేశంతో కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని చెరువుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కాకతీయ రాజుల పాలనలో కళకళలాడిన గొలుసుకట్టు చెరువులు దశాబ్దాల కాలం తర్వాత కేసీఆర్ పాలనలో మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో ఉన్న 999 చెరువులకు మిషన్ కాకతీయ పథకం కింద పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతులను మంజూరు చేసింది.
నాలుగు విడతల్లో ఈ పథకం కింద రూ.132.95 కోట్ల వరకు నిధులను వెచ్చించి 956 చెరువులను బాగు చేసింది. కట్టలపై ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించారు. తూములకు మరమ్మతులు చేపట్టారు. చెరువు అంతర్భాగంలో పేరుకుపోయిన పూడికనూ తొలగించారు. గత ప్రభుత్వ చర్యలతో చెరువులు పటిష్టంగా మారి భారీ వర్షాలకు సైతం చెక్కుచెదరలేదు. కానీ ఏడాదిలోనే చెరువులు కళను కోల్పోయాయి.
గత బీఆర్ఎస్ హయాంలో నీటితో కళకళలాడిన చెరువులు అడుగంటి దయనీ యంగా మారాయి. వానకాలం సాగుకు రైతు భరోసా లేక, రుణాలు అందక జిల్లా రైతాంగం ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నది. ఈ పరిస్థితుల్లోనే చెరువుల్లో నీళ్లు అం తంత మాత్రంగానే ఉండడంతో రైతులకు సాగునీటి కష్టాలు సైతం మొదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాలో చాలావరకు రైతాంగం బోరు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నది. భూగర్భజలాలు అంతంతమాత్రంగానే ఉండ డంతో బోర్లలో నీళ్లు తగ్గిపోనున్నాయి.
అటు బోర్లలోనూ నీళ్లు లేక, ఇటు చెరువులు అడుగంటి రానున్న రోజుల్లో సాగు నీటి కష్టాలు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని రైతులు ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను ప్రతియేటా వదలడంతో మత్స్యకారులు ఉపాధి పొం దుతూ సంతోషంగా గడిపారు.
అయితే ఈసారి చెరువుల్లో అంతంత మాత్రంగానే నీటి నిల్వలు ఉండడం..ఇప్పటివరకు చెరువుల్లోకి చేప పిల్లలను వదలకపోవడంతో మత్స్యకార్మికులు సైతం ఆందోళన చెందుతున్నారు. మిషన్ కాకతీయ చెరువులకు ఆదరువు లేకపోవడంతో రాబోవు రోజుల్లో పశు పక్షాదులకు సైతం నీటి ఇక్కట్లు తప్పేలా లేవు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టక పోవడంతో జిల్లాలో చెరువుల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అవసరమైన పనులను చేపట్టాల్సి ఉండగా.. ఈ ప్రక్రియను ఇప్పటికీ చేపట్టలేదు. తట్టెడు పూడిక సైతం తీయలేదు. పర్యవేక్షణ కరువై చెరువు కట్టలపై కంప చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.
ఒకప్పుడు జీవధారగా ఉన్న గొలుసుకట్టు చెరువు లు వైభవాన్ని కోల్పోతున్నాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించిన వనరులు కళ తప్పి ఆదరణ కోల్పోతున్నాయి. కొన్ని పూడిపోయాయి. ఇంకొన్ని ఆక్రమణల్లో కలిసిపోయాయి. మరికొన్ని ఉన్నా.. లేనట్టే అయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉన్న చెరువులు కాస్తా.. కాలక్రమంలో నీటి గుంటల్లా మిగిలాయి. ఉన్న ఆ కొద్ది పాటి వనరుల్లోకి వర్షాకాలంలో నీళ్లొచ్చినా నిల్వ ఉండేది కొన్ని రోజులే అన్నట్లుగా మారాయి.