బషీరాబాద్, మే 25 : రైతన్న ఆరుగాల కష్టం నీటిపాలవుతున్నది. వరిని పండించి.. తేమ శాతం తగ్గే వరకు కల్లాల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే.. అక్కడి సిబ్బంది పలు రకాల కొర్రీలు పెడుతుండటంతో అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తూకం వేసేందుకు తీసుకొచ్చిన ధాన్యం.. అదేవిధంగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించని వడ్లు తడిసి ముద్దయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాశీంపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఒకటి.. నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో మైల్వార్, దామర్చేడ్, నవల్గా, నవాంద్గి గ్రామాల్లో మరో నాలుగు కేంద్రాలను ఓపెన్ చేశారు. నవాంద్గి, నవల్గా కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడి కేంద్రాల నిర్వాహకులు తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడంతో ఆదివారం సాయంత్రం కురిసిన వానకు తడిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం కంటే విక్రయించడమే గగనంగా మారిందని పేర్కొంటున్నారు. కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా నిర్వాహకులు కనికరించడంలేదని.. ధాన్యం తీసుకొచ్చిన అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూకం వేసిన ధాన్యం తడిసిపోతే.. వాటిని మళ్లీ ఆరబెట్టేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా మైల్వార్, దామర్చేడ్ గ్రామాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లోనూ వర్షానికి ధాన్యం తడిసినట్లు రైతులు తెలిపారు.