రంగారెడ్డి, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇటీవల కురిసిన వానలతో పత్తి పంటకు అధిక నష్టం కలిగింది. పొల్లాలో నీళ్లు నిలిచి పంట మొత్తం ఎర్రబడింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంత రైతులకు పత్తి పంట ప్రాధానమైనది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో దిగుబడి అధికంగా వస్తుందని రైతులు ఆశించారు. మరో పది రోజుల్లో పంట చేతికందుతుందని అనుకుంటున్న సమయంలో అధికంగా కురిసిన వానలతో పంటకు తీవ్ర నష్టం కలిగింది. తడిసిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్కు తీసుకెళ్తే రూ. ఐదు వేలకే క్వింటాల్ అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని.. ప్రభుత్వమే ఆదుకోవాలని పత్తిరైతులు కోరుతున్నారు.
జిల్లాలో 1,30,000 ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ వానకాలంలో 1,30,000 ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయంలో భారీ వర్షాలు రైతులను పూర్తిగా కష్టాల్లోకి నెట్టాయి. యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తా ల్, ఆమనగల్లు, కొందుర్గు, కేశంపేట, కందుకూరు, నందిగామ, కొత్తూరు, షాబాద్ వంటి మండలాల్లో అత్యధికంగా పత్తిని సాగు చేశారు. ఈ పంట ఆశాజనకంగా ఉండడంతో తా ము చేసిన అప్పులు తీరుతాయని అన్నదాతలు భావించారు. కానీ, ఊహించని రీతిలో వర్షా లు వచ్చి రైతుల ఆశలను ఆవిరి చేశాయి.
మాడ్గులలోనే 50,000 ఎకరాల్లో ..
మాడ్గుల మండలం పత్తి సాగు కు పెట్టింది పేరు. ఈ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ రైతులు పత్తి పంట ను అధికంగా సాగు చేస్తారు. ఈ మండలంలో దాదాపుగా 50,000 ఎకరాల్లో ఈ పంట సాగు అవుతున్నట్లు సమాచారం. వర్షాలతో పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగినా అధికారులు మాత్రం రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. వానలకు పంట తడిసి ముైద్దె.. నలుపు రంగు లోకి మారడంతో దానిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముతూ నష్టాల పాలవుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో అప్పులను ఎలా తీర్చాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట తడిసి ముైద్దెంది..
ఐదెకరాల్లో పత్తిని సాగు చేశా. వానలకు పంట మొత్తం తడిసిపోయి రంగు మారింది. వ్యాపారులు దానిని కొనేందుకు ముందుకొస్తలేరు. అప్పులు చేసి పంటను సాగు చేశా. ఇప్పుడు పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి తమను ఆదుకోవాలి.
-పోలే నర్సింహ, అవుర్పల్లి, మాడ్గుల
మద్దతు ధర చెల్లించాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు పలు గ్రా మాల్లో పత్తి పంట పూర్తిగా తడిసిపోయింది. దానిని కొనేందుకు సీసీఐ, వ్యాపారులు ఎవరూ ముందుకు రావడంలేదు. రూ. ఐదు వేలకే క్విం టాల్ పత్తి కొంటామని వ్యాపారులు చెబుతున్నారు. తక్కువ ధరకు అమ్మితే తాము తీవ్రంగా నష్టపోతాం. ప్రభుత్వమే తడిసిన పత్తికి మద్దతు ధర చెల్లించి.. కొనుగోలు చేయాలి.
-గుండ్ల రవి అవుర్పల్లి, మాడ్గుల మండలం