కొడంగల్, మే 20 : మండల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది.
దాదాపు అరగంటకు పైగా ఉరుములు, మెరుపులతో వర్షం కురియడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత మూడు రోజుల నుంచి ఓ మోస్తరుగా కురుస్తూనే ఉన్నది. దీంతో ఉక్కబోతతో ఇబ్బంది పడ్డామని సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కురువడంతో వాతావరణం చల్లబడిందని స్థానికులు పేర్కొన్నారు.
బొంరాస్‌పేట : బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. దుద్యాల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దుద్యాల, వాల్యానాయక్తండాల్లో 12 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై స్తంభం విరిగిపడింది. దుద్యాల ఉన్నత పాఠశాలలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
పోలేపల్లిలోని రైస్‌మిల్లుకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే తీగలపై ఎల్లమ్మ ఆలయం సమీపంలో చెట్టు కూలడంతో మూడు స్తంభాలు నేలకొరిగాయి. దుద్యాల పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. వరి పొలాలు కోయడంతో పంటలకు నష్టం వాటిల్లలేదు. బొంరాస్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా రైతులు ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లు కప్పి ఉంచారు. దీంతో ధాన్యం తడవలేదు. గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలోని బోయినిగడ్డతండాలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. పక్క ఇంట్లో ఉన్న రాముకు విద్యుత్ షాక్ తగిలింది.