 
                                                            రంగారెడ్డి, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం క్షేత్రస్థాయిలో అంచనా వేసి నివేదికలు తయారుచేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఉష ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా తిరుగుతూ పంటనష్టం అంచనా వేస్తున్నారు. కాగా, 33 శాతం కంటే ఎక్కువ నష్టం జరిగిన రైతుల పేర్లను మాత్రమే రాసుకోవాలన్న ప్రభుత్వ నిబంధన ఉన్నందున పంటనష్టం జరిగిన అనేకమంది రైతులు పరిహారానికి నోచుకునే అవకాశం లేకుండా పోయింది.
పత్తి, వరికి అపార నష్టం..
జిల్లాలో ఈ వర్షాకాలంలో రైతులు రెట్టింపు స్థాయిలో వరి, పత్తిపంటను వేశారు. జిల్లాలో 1,20,000 ఎకరాల్లో పత్తి, 1,30,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఈ పంటలు చేతికందే సమయం లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చేరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చాలాచోట్ల పత్తి, వరిపంట నీట మునిగింది. యా చారం మండలంలోని మొండిగౌరెల్లిలో పక్కీరోనికుంట నిండి మరో రెండు రోజుల్లో కొయాలనుకున్న దాదాపు 30 రైతుల వరి పంట పూర్తిగా నీట మునిగింది. అలాగే, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, కొందుర్గు, కేశంపేట తదితర మండలాల్లోనూ మరో రెండు రోజుల్లో తీయాలనుకున్న పత్తి కూడా తడిసి ముద్దయ్యింది. తడిసిన పత్తిలో తేమశాతం పెరగడంతో ధర తగ్గే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు అపార నష్టం జరిగినందున అధికారులు పూర్తిస్థాయిలో అంచనా వేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.
జరిగింది కొండంత..మొక్కుబడిగా అంచనా 
జిల్లాలో వరి, పత్తి పంటలకు భారీ నష్టం జరిగింది. ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కాగా, గురువారం వ్యవసాయాధికారులు అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచ నా వేశారు. గురువారం నాటి ప్రాథమిక అంచనాలో 475 ఎకరాల్లో మాత్రమే వరి, పత్తి పంట లకు నష్టం జరిగిందని 315 మంది రైతులే పూర్తిస్థాయిలో నష్టపోయారని అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చారు. పత్తికి అధికంగా నష్టం జరిగినా అధికారులు మొక్కుబడిగా అంచనా వేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడ్గుల మండలంలోనే 50 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. మరో రెండు రోజుల్లో పంట చేతికందే సమయంలో వర్షాలు కురువడంతో రైతులకు అపారనష్టం కలిగింది.

నేలకొరిగిన వరిపంట..
ఇబ్రహీంపట్నం/యాచారం : మొంథా తుఫాన్ ప్రభావంతో ఇబ్రహీంపట్నం, యాచారం మండ లాల్లో వరి, టమాట పంటలు నీటమునిగాయి. పత్తి తడవడంతో నల్లగా మారి మొలకెత్తిందని రైతులు వాపోతున్నారు. యాచారం మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో నీట మునిగిన పంటలను స్థానిక నాయకులు రవీందర్, యాదగిరిరెడ్డి పరిశీలించారు. పరిహారం చెల్లించి రైతు లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఇదిలా ఉంటే మండలంలో కురిసిన వానకు తాటిపర్తిబందం చెరువు, కుర్మిద్ద పెద్ద చెరువు, ధర్మపురి చెరువులకు జలకళ సంతరించుకుంది. ధర్మపురి చెరువు మత్తడి పోస్తున్నది. బందం చెరువు మత్తడి పోస్తే గొలుసుకట్టు చెరువులకు పుష్కలంగా నీరు వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అపార నష్టం.. 
షాబాద్ : అకాల వానలతో చేతికొచ్చిన వరి, పత్తి పంటలు నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కండ్లముందే వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోతకొచ్చిన వరి పంట ఈదురు గాలులతో కూడిన వానకు నెలకొరిగింది. మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పత్తి పాడవుతున్నది
అకాల వానలకు పత్తి మొత్తం పాడవుతున్నది. నాకున్న మూడు ఎకరాల పొలంతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని పత్తిని సాగు చేశా. పెట్టుబడి కోసం రూ.3 లక్షలకు పైగానే ఖర్చు పెట్టా. పత్తి తీసే సమయంలో మొం థా తుఫాన్ రావడంతో పత్తి మొత్తం తడిసిపోయి చేనులోనే మొలకెత్తుతున్నది. పెట్టుబడులా వచ్చేలా కనిపించడం లేదు.ప్రభుత్వమే ఆదుకోవాలి.
-చెన్నయ్య, రైతు, బోడంపహాడ్, షాబాద్
పంట వర్షార్పణం
వరి పంట చేతికొచ్చింది. వారం రోజుల్లో కొయిద్దామనుకుంటున్న సమయంలో మొంథా తుఫాన్ ప్రభావంతో పంట పూర్తిగా నేలవాలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలరాలడంతో పెట్టిన పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి.
-కంబాలపల్లి హన్మంత్‌రెడ్డి, చర్లపటేల్‌గూడ
పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక 
జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరి, పత్తి పంటలకు అపార నష్టం జరిగింది. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్దలో పంటలను పరిశీలించా. పంటనష్టం జరిగిన రైతులు అధైర్యపడొద్దు. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితే ప్రభుత్వానికి పరిహారం కోసం నివేదిస్తాం. పంటలు నష్టపోయిన గ్రామాల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన నివేదికలను పంపిస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది.
-ఉష, జేడీఏ
 
                            