పరిగి, సెప్టెంబర్ 24: పరిగి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటకు పైగా వర్షం కురియడంతో పరిగి సమీపంలోని వాగు వరద నీటితో ప్రవహించింది. మండలంలోని పలు గ్రామాల్లో సైతం వర్షం కురిసింది. అలాగే రాత్రి 7.30 గంటల నుంచి మళ్లీ వర్షం కురిసింది. వరద నీరు లఖ్నా పూర్ ప్రాజెక్టులోకి చేరింది.
బొంరాస్పేట : బొంరాస్పేట మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఆది, సోమవారాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. వర్షాలకు పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. వరుసగా మూడో ఏడాది కూడా చెరువు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కింద యాసంగిలో వెయ్యి ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి పక్కనే చెరువు ఉండడంతో వాహనదారులు అలుగును చూడడానికి తరలివస్తున్నారు.