ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉమ్మడి జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు సెగ్మెంట్లతోపాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొడంగల్ సెగ్మెంట్లో జిల్లా పోలీస్ సిబ్బంది, కేంద్ర పారామిలిటరీ బలగాలు, కర్ణాటక రాష్ట్ర పోలీసులతోపాటు శిక్షణలో ఉన్న పోలీసులు మొత్తం రెండువేల మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.
ఇందులో 45 కంపెనీల కేంద్ర బలగాలు, 14 కంపెనీల టీఎస్ఎస్పీ బలగాలు, 750 మంది కర్ణాటక పోలీసులు, 260 మంది శిక్షణ పోలీసు అధికారులు, అదేవిధంగా జిల్లాకు చెందిన 800 మంది పోలీస్ అధికారులతోపాటు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో స్పందించేందుకు 19 ైస్టెకింగ్ ఫోర్స్ బృందాలు, 4 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా, మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పోలీస్ శాఖ ఐదంచెల పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.