ఇల్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు.. సొంత జాగ ఉండి ఇల్లు నిర్మించుకోవాలనే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందించనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయగా రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. మొదటి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇండ్లకు ఆర్థికసాయం అందించనున్నారు. దశలవారీగా అర్హులందరికీ సాయమందించనున్నారు. తొలి విడుత దరఖాస్తులకు ఈ నెల 12 చివరితేదీ కాగా, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. స్వీకరించిన దరఖాస్తులను ఈ నెల 20 తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం 25వ తేదీన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాల్లోని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం కానున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ‘నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ‘గృహలక్ష్మి’ పథకానికి జిల్లాలో విశేష స్పందన వస్తున్నది. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 3వేల మందిని ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. తద్వారా రంగారెడ్డి జిల్లాలో 22,150 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఈ పథకానికి మొదటి విడుతలో దరఖాస్తులకు ఈనెల 12 చివరి తేదీ కాగా.. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను అధికారులు పరిశీలించనున్నారు. 25న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.’
మూడు విడుతల్లో ఆర్థికసాయం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి వేలాది మంది పేదలకు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సొంత జాగాల్లో ఇండ్లను నిర్మించుకునే వారికీ ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నది. రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని పూర్తి రాయితీతో అందించి పథకాన్ని అమలు చేయబోతున్నది. ఈ సాయాన్ని మూ డు విడతల్లో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోనే జమ చేసే లా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దళారుల ప్రమేయం లే కుండా పారదర్శకంగా గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ప్రతి నియోజకవర్గంలో 3వేల మందికి
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3వేల మందికి ‘గృహలక్ష్మి’ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. దీంతో రంగారెడ్డి జిల్లాలో మొత్తం 22,150 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఒకవేళ ఇంతకన్నా ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉంటే వారికి మరో విడుతలో సాయం చేస్తారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి అర్హులకు ప్రభుత్వం సాయం అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఈనెల 20 వరకు క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఈనెల 25న జిల్లా మంత్రి ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనున్నది.
ఎంపికలో సామాజిక న్యాయం
గృహలక్ష్మి పథకాన్ని ఆన్లైన్ ఆధారితంగానే అమలు చే సేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సెంట ర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పర్యవేక్షణలో గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురానున్నది. అలాగే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇండ్ల మంజూరు, బిల్లులకు సంబంధించిన ప్రక్రి య మొత్తం ఆన్లైన్లోనే సాగుతుంది. సామాజిక వర్గాల వారీగా గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50శాతం, ది వ్యాంగులకు 5శాతం తగ్గకుండా ప్రాధాన్యత ఇవ్వనున్నా రు. ఇంటి నిర్మాణ శైలిని లబ్ధిదారుడు ఇష్టపూర్వకంగా కట్టుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ప్రత్యేక కౌంటర్లు
జిల్లాలో గృహలక్ష్మి దరఖాస్తుల ప్రక్రియ గురువారం నుం చి ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్యాలయాలు మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ అ కౌంట్లతో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని.. విడుతల వారీ గా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందనుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. చాలామంది నిరుపేదలకు సొం త జాగా ఉన్నప్పటికీ రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ఇల్ల్లు కట్టుకునే స్థోమత లేదు. ఇలాంటి వారికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం కొండంత ఆసరా అవుతున్నది.