వికారాబాద్, డిసెంబర్ 14 : నేడు, రేపు జరిగే టీజీపీఎస్సీ గ్రూప్ -2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలు నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో కలిసి కలెక్టర్ జూం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వికారాబాద్ రీజియన్ పరిధిలో 19, తాండూరు రీజినల్ పరిధిలో 11 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 10,381 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మూడు 4401, 4402, 4404 (పీడబ్ల్యూడీ) సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లు, శాఖాపరమైన అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించాలన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామన్నారు. ప్రభుత్వ గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ టీవీ హనుమంత రావు, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, పబ్లిక్ సర్వీస్ రీజినల్ కోఆర్డినేటర్ నరేంద్ర కుమార్, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేమత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ) : నేడు, రేపు జరుగనున్న గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 90 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 56,883 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. 15, 16వ తేదీల్లో ఉదయం 10 నుంచి 12:30 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు రెండో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయడంతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపారు.