కొడంగల్, ఏప్రిల్ 7 : నీటి కరువుతో చేతికొచ్చిన పంట పశువులకు మేతగా మారుతున్న ది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. బోర్లు వట్టిపోయి ఎండిపోతుండడంతో అన్నదాత కంట కన్నీరు వస్తున్నది. నియోజకవర్గంలో ప్రాజెక్టులు, కాల్వలు అం దుబాటులో లేవు. వర్షంపైనే ఆధారపడి రైత న్న పంటలను సాగు చేస్తున్నాడు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పుష్కలంగా వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు నిండి భూగర్భజలాలు పెరిగాయి.
అప్పుడు రెండు పంటలను పండించుకుని సంతోషంగా జీవించామని పలువురు అన్నదాతలు పేర్కొంటున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిపడా వానలు కురియక.. భూగర్భజలాలు తగ్గి బోరు బావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయని.. వాటి ని పశువులకు మేతగా వేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆలేడ్, హస్నాబాద్, అల్లిఖాన్‌పల్లి, దుద్యాల, హకీంపేట, చెట్టుపల్లితండా, చిల్ముల్ మైల్వార్ తదితర గ్రామాల్లో నీరందక పంటలు ఎండిపోయాయి.
అదేవిధంగా కుదురుమల్ల గ్రామానికి చెందిన నరేశ్ మూడు ఎకరాల్లో వరిని సాగు చేయగా.. ప్రస్తుతం నీళ్లు అందక రెండు ఎకరాల్లోని పంట ఎండిపోయింది. ఆలేడ్ గ్రామానికి చెందిన మో త్కూరు వెంకటయ్య, ఆంజనేయులు రెండు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట, హస్నాబాద్ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి రెండు ఎకరాల్లో వరిని నాటు వేయగా బోర్లు వట్టిపోయి పంట మొత్తం ఎండిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు ఎలా తీర్చాలి.. దేవుడా..?
కులకచర్ల : అడుగంటుతున్న భూగర్భజలాలలతో బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటకు సరిపడా నీరందక ఎండుతుండడంతో అన్నదాత తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. మండలంలో ఈ యాసంగిలో 5150 ఎకరాల్లో 4520 మంది రైతులు వరి పంటను సాగు చేయగా.. సాల్వీడ్ గ్రామంలో 210 ఎకరాల్లో 175 మంది రైతులు వరి పంటను సాగు చేశారు. బోరు బావులను నమ్ముకుని వరిని వేయగా.. నీరు పాతాళానికి చేరడంతో పంటలు ఎండిపోతున్నాయని.. తీసుకొచ్చిన అప్పులను ఎలా తీర్చాలి.. దేవుడా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.50వేల లాగోడి.. భూమిపాలైంది..
బోరును నమ్ముకుని రెండు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. ఇందుకు రూ. 50,000 వరకు ఖర్చు అయింది. భూగర్భజలాలు తగ్గిపోవడంతో బోరు నుంచి నీళ్లు రాక.. సాగు చేసిన పంట మొత్తం ఎండిపోయింది. ఆ పంటను కోసి పశువులకు మేతగా వేస్తున్నా. తీసుకొచ్చిన అప్పును ఏలా తీర్చాలో అర్థం కావడంలేదు.
– పిల్లి వెంకటయ్య రైతు, కుదురుమల్ల, కొడంగల్
మామిడి తోట, వరికి నీరందడం లేదు..
బోర్లు ఉన్నాయనే నమ్మకంతో ఐదు ఎకరాల్లో మామి డి తోట, మరో ఐదు ఎకరాల్లో వరి పంటను సాగు చేశా. ప్రస్తుతం మూడు బోర్ల నుంచి సరిపడా నీళ్లు రాకపోవ డంతో తోట, వరి పంట ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లను తవ్విద్దామన్నా నీళ్లు పడతాయో లేదో అన్న భయం ఉన్నది. వరి పొట్ట దశకు రాగానే నీళ్లు అందడం లేదు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
-ముక్తార్, రైతు, ఆలేడు, కొడంగల్
మూడు బోర్లు వేసినా ఫలితంలేదు
నేను రెండెకరాల్లో వరి పంట వేశా. గతంలో మూడు బోర్లు వేయగా నీళ్లు పుష్క లంగా ఉండేవి. కానీ, వేసవికాలం రావడంతో భూగర్భజలాలు తగ్గి బోర్లు సరిపడా నీళ్లు పోయక పంట మొత్తం ఎండిపోతున్నది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
-రమేశ్, రైతు సాల్వీడ్, కులకచర్ల
నాలుగు బోర్లు వేశా..
నేను రెండెకరాల్లో వరి పంటను సాగు చేశా. దానిని కాపాడుకునేందుకు నాలుగు బోర్లను తవ్వించా. అయినా, వాటిలో నీటి శాతం తగ్గిపోయింది. దీంతో వాటిని నమ్ముకుని సాగు చేసిన వరి పంట మొత్తం ఎండిపోతున్నది. ఇతరుల వద్ద అప్పులు తీసుకొచ్చి నాలుగు బోర్లను తవ్వించగా.. ఆ అప్పును ఎలా తీర్చాలో అర్థం కావడంలేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువు కూడా భారంగా మారింది. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
-బస్వరాజ్, రైతు సాల్వీడ్, కులకచర్ల