వికారాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుతానికి ఒక మీటర్ మేర తగ్గాయి. మరోవైపు మే నెలాఖరుకు జిల్లాలో భూగర్భజలాలు ప్రమాదకర స్థాయి లో పడిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు 70 శాతం మేర తగ్గిపోగా.. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్, కాక్రవేణి, అల్లాపూర్, నందివాగు, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూగర్భజలాలను పెంపొందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఇం కుడు గుంతలను నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించింది.
13.72 మీటర్లకు చేరిన భూగర్భజలాలు..
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరుకు 12.87 మీటర్లకు, మార్చి చివరి నాటికి 13.72 మీటర్లకు నీటి నిల్వలు తగ్గాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలాఖరుకు నీటి నిల్వలు అధికంగా తగ్గాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా మర్పల్లి మండలంలో 27.17 మీటర్ల లోతుకు, దుద్యాల మండలంలో 26.8 మీటర్లకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దోమలో 20.66, వికారాబాద్‌లో 19.83, కోట్‌పల్లిలో 17.21, పరిగిలో 15.92, నవాబుపేటలో 15.09, తాండూరులో 15.06, యాలాలలో 13.49, ధారూరులో 11.87, కులకచర్లలో 10.2, బంట్వారంలో 10.02, బషీరాబాద్‌లో 11.32, బొంరాస్ పేటలో 12.21, చౌడాపూర్‌లో 6.4, దౌల్తాబాద్‌లో 9.25, కొడంగల్‌లో 9.1, మోమిన్‌పేటలో 10.49, పూడూరు మండలంలో 7.78 మీటర్లకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి.
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు..
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్న దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా ఎక్కడైతే తాగునీటి సమస్య ఏర్పడుతుందో సంబంధిత ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పైప్లైన్ల లీకేజీలు, బోర్‌వెల్స్, బోరుబావులు పాడైన 24 గంటల్లోనే బాగు చేసేలా చర్యలు చేపట్టాం. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లను తవ్విస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేసేందుకు సంబంధిత యంత్రాంగాన్ని సిద్ధం చేశాం.
– దీపక్ తివారీ, వికారాబాద్ కలెక్టర్