రంగారెడ్డి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు అన్నదాతలు పెద్దఎత్తున బోర్లను తవ్విస్తున్నారు. జిల్లాలోని 21 రూరల్ మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం ఆ పంట పొట్ట దశలో ఉండటంతో నీటి అవసరం అధికంగా ఉంటుంది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, కేశంపేట, కొందుర్గు, చేవెళ్ల, షాబాద్, షాద్నగర్, మొయినాబాద్, రూరల్ మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పాతాళ గంగను పైకి తీసుకొచ్చేందుకు అన్నదాతలు బోరుబావులను తవ్విస్తున్నారు. వరితోపాటు కూరగాయలు, మామిడితోటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఓ వైపు బోర్లు వేయిస్తూనే.. మరోవైపు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు.
విద్యుత్తు కోతలతో అవస్థలు
వేసవి నేపథ్యంలో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. బోరుబావులకు త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులు రాత్రివేళలో టార్చ్లైట్లతో పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. విద్యుత్తు మోటర్లకు సక్రమంగా విద్యుత్తు అందకపోవటంతో పంటలకు నీరు కూడా సరిపోవడంలేదు.
వెయ్యి ఫీట్ల లోతు వేసినా రాని నీళ్లు
బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల్లో పూడిక తీయడంతోపాటు చెరువుల్లోకి నీరొచ్చే ప్రధాన కాల్వలకు మరమ్మతులు చేయడంతో వర్షాకాలంలో వచ్చిన నీటితో కళకళలాడేవి. కాంగ్రెస్ సర్కార్ కాల్వల మరమ్మతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వర్షపునీరు చెరువులు, కుంటల్లోకి చేరకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. జిల్లాలో సుమారు 40 మీటర్ల లోతు వరకు నీటిమట్టం తగ్గిపోయినట్టు అధికారులు గుర్తించారు. గతంలో గ్రామీణ మండలాల్లో 200 ఫీట్ల వరకు బోర్లు వేస్తే నీరు సమృద్ధిగా వచ్చేవి. ప్రస్తుతం నీటిమట్టం తగ్గిపోవటంతో 800 నుంచి 1000 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీరు రాని పరిస్థితి ఏర్పడింది. గతంలో బోరేస్తే రూ.50వేల వరకు ఖర్చుకాగా.. ప్రస్తుతం లక్ష వరకు ఖర్చవుతున్నది.