వికారాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నుంచే చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమం గా తగ్గుతున్నట్టు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే కొంతమేర జిల్లాలో నీటి నిల్వలు తగ్గగా, ఈ ఏడాది జనవరితో పోలిస్తే 3 మీటర్లకుపైగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో 9.82 మీటర్ల లోతులో భూగర్భజలాలుండగా, ఫిబ్రవరి చివరి నాటికి 12.87 మీటర్లకు చేరాయి.
మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే నెలల వరకు అయితే జిల్లాలో భూ గర్భజలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశమున్న దృష్ట్యా భూగర్భజలాలూ భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువులతోపాటు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడం చూస్తే ఈనెలాఖరు నాటికి ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్, కాక్రవేణి, అల్లాపూర్, నందివాగు, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు సగానికిపైగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భూగర్భజలాలను పెంపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఇంకుడు గుంతలను నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించింది. భూగర్భజలాలు సాధారణం కంటే అధికంగా పడిపోతుండడంతో జిల్లాలో రానున్న రెండు నెలల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ఫిబ్రవరి చివరి నాటికి 12.87 మీటర్ల లోతుకు చేరాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అవి క్రమంగా తగ్గుతున్నట్టు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఏప్రిల్, మే నెలల్లో వాటి పరిస్థితి మరీ దారుణంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా దుద్యాల మండలంలో 29.54 మీటర్లకు, మర్పల్లి మండలంలో సగటున 22.25 మీటర్లు, కోట్‌పల్లి మండలంలో 20.46 మీటర్ల లోతుకు భూగర్భజలాలు అడుగంటిపోయాయి.
వికారాబాద్ మండలంలో 17.56 మీటర్లు, పరిగిలో 15.71, తాండూరులో 14.81, నవాబుపేటలో 13.92, యాలాలలో 12.79, బొంరాస్‌పేటలో 13.52, దోమలో 14.64, ధారూరులో 12.03, బషీరాబాద్‌లో 9.25, పెద్దేముల్లో 7.8, పూడూరులో 6.63, మోమిన్‌పేటలో 9.13, కులకచర్లలో 8.69, కొడంగల్‌లో 7.65, దౌల్తాబాద్‌లో 7.78, చౌడాపూర్‌లో 8.68, బం ట్వారం మండలంలో 8.92 మీటర్లకు అడుగంటిపోయాయి. మరోవైపు జిల్లాలో గతేడాది నుంచి తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యా యి.
బీఆర్ఎస్ హయాంలో పదేండ్లపాటు తాగునీటి సమస్య లేకుండా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందించి చెక్ పెడితే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరగడం భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈనెలాఖరు వరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి.