“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఇవి. కానీ ప్రస్తుత అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. భూగర్భ జలాల పెంపునకు తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలించడంతో జిల్లాలో జల సిరులు సమృద్ధిగా ఉన్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత చేపట్టి నీటి నిల్వ సామర్థ్యం పెంచడంతో గత కొన్నేండ్లుగా భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆగిఆగి పోసిన బోర్లు నేడు నిరంతరాయంగా పోస్తుండడంతో సాగుకు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి. జూలై మాసంలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే ఏకంగా 112.9 మి.మీ వర్షం అధికంగా కురిసింది. దీంతో గతంతో పోలిస్తే భూగర్భజలాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు 8.96 మీటర్ల లోతులోనే లభ్యమవుతున్నాయి. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఈ ఏడాది తాగు, సాగు నీటికి ఢోకా ఉండదని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పాతాళగంగ ఉబికి పైపైకి వస్తున్నది. ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోయినా జూలైలో మాత్రం సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు స్థాయిలో వానలు పడ్డాయి. ఈ ఏడాదిలో కురవాల్సిన వర్షపాతంలో సగానికి పైగా వర్షపాతం ఒక్క జూలై నెలలోనే నమోదైంది. జూలైలో జిల్లా సాధారణ వర్షపాతం 146.6 మి.మీ కాగా.. 312.1మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 112.9మి.మీ అధికంగా కురిసింది. ఈ ఏడాది మొత్తంలో 725.8మి.మీ వర్షం కురవాల్సి ఉండగా..ఇప్పటికే 400.7మి.మీ కురిసింది. గత కొన్నేండ్లుగా చూస్తే.. ఇదే అత్యధిక వర్షపాతం. విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో ఉన్న మొత్తం రెండు వేలకుపైగా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. భూ గర్భజలాలు గణనీయంగా పెరిగి భూఉపరితలానికి సమీపంలోనే నీరు పుష్కలంగా లభిస్తున్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు జిల్లాలో ఉన్న తాగు, సాగు నీటి ఇబ్బందులు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం గత ఆరు, ఏడేండ్లుగా నీటి సంరక్షణకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలివ్వడంతో జిల్లాలో గతంలో కంటే పరిస్థితులు మెరుగుపడ్డాయి. ‘మిషన్ కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం తీసుకురావడం.. ఉపాధిహామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను విరివిగా చేపట్టడం.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో ప్రజల్లో వచ్చిన చైతన్యం తదితర పరిస్థితులు.. భూగర్భ జలాలు పెరుగడానికి కారణమయ్యాయి. సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న తరుణంలోనే ప్రభుత్వం సాగుకు 24 గంటల కరెం టు, పెట్టుబడి సాయం అందిస్తుండడంతో జిల్లాలో పంటల సాగు గత తొమ్మిదేండ్లలోనే మూడింతలు పెరిగింది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా వానకాలం పంటల సాగు సైతం జోరుమీదున్నది. ఏదిఏమైనా పెరిగిన భూగర్భ జలాలు జిల్లా రైతాంగానికి గొప్ప వరంలా మారాయి.
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు ఒక్కసారిగా పాతాళాన్ని వీడి పైకి ఉబికి వచ్చాయి. గత యేడాది జూలైతో పోలిస్తే.. ఈసారి జూలైలో ఏకంగా 1.41 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరి గాయి. జిల్లాలో గతేడాది జూలైలో 10.37 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉంటే.. ఈసారి 1.41 మీటర్లు పెరిగి 8.96 మీటర్ల లోతులోనే నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. జూలైలో కురిసిన వర్షాలకు జిల్లాలోని పలు మండలాల్లోనూ భూగర్భ జలాలు ఆశించిన మేరలో పెరిగాయి. ప్రస్తుతం కందుకూరు మండలంలో భూగర్భజలాలు గణనీయంగా పెరుగడంతో ఆ మండలంలోని రాచలూరులో 1.45 మీట ర్ల లోతుల్లోనే భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయి. ఇబ్రహీంపట్నంలో మాత్రం భూగర్భజలాలు పాతాళంలోకి పడిపోయాయి. 23.08 మీటర్ల లోతులో ఉన్నాయి.
గత నెలలో భారీగా వర్షపా తం నమోదవ్వడంతోపాటు ప్రభుత్వం నీటి సంరక్షణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాల ను ఇవ్వడంతో భూగర్భ జలా లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది సాగు, తాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. రైతులు కూడా నీటి వినియోగం తక్కువ ఉన్న పంటలనే సాగు చేస్తే బాగుంటుంది. అలాగే వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టేలా రైతులు తమ పంట పొలాల్లోనే నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటే భూగర్భజలాలు మరింత పెరుగుతాయి.
-రఘుపతిరెడ్డి, భూగర్భజల శాఖ రంగారెడ్డి జిల్లా అధికారి