పెద్దేముల్, ఏప్రిల్ 11 : ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నా.. అభివృద్ధి చేసి చూపిస్తున్నా అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా చైతన్యనగర్, దుగ్గాపూర్, మారేపల్లితండా, మన్సాన్పల్లి, ఎర్రగడ్డతండా, మదనంతాపూర్, కొండాపూర్, నెల్లిగడ్డతండా, రేగొండి, రుక్మాపూర్, మంబాపూర్, ఖానాపూర్, కందనెల్లి గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు, అంబేద్కర్ విగ్రహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయని, గడిచిన సంవత్సర కాలంలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి పెద్దఎత్తున నిధులు సమకూరి శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గెలిచినప్పటి నుంచి వరుసగా ఎన్నికలు, కరోనా మహమ్మరి విజృంభణతో గ్రామాల అభివృద్ధి ఆగినా వెనకాడకుండా గత సంవత్సరం నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేసి గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకుంటున్నాం
ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నెల రోజుల్లో సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఇండ్లు లేనివారికి దశలవారీగా రూ.3లక్షలను కూడా అందించనున్నారన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామాలను ప్రగతిపథంలో నడిపిస్తున్నామన్నారు. మోదీ బోర్ మోటర్లకు మీటర్లు పెడతా అంటే.. సీఎం కేసీఆర్ బరాబర్ పెట్టనీయను ఏం చేసుకుంటావో చేసుకో అని తేల్చిచెప్పి నిరుపేదల పక్షాన నిలబడ్డారన్నారు. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాలకు దొంగల్లాగా వచ్చారు.. దొంగల్లాగా పోయారు తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. బీజేపోన్ని బొందపెట్టాలని.. కాంగ్రెసోన్ని తరిమికొట్టాలని, కల్లబొల్లి మాటలు నమ్మరాదని సూచించారు. తాను తాండూరు బిడ్డనని.. తాండూరులో పుట్టానని.. తాండూరులోనే చస్తానని.. మీ ఆశీర్వాదం నాపై, నాయకులపై ఎప్పటికీ ఉండాలని కోరారు. తెలంగాణను మనమే కాపాడుకోవాలని.. ఇతర పార్టీ నాయకులతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ఎంపీటీసీల రాష్ట్ర ఫోరం ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌చారి, మండల అధ్యక్షుడు ధన్సింగ్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, జితేందర్‌రెడ్డి, నరేశ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రవి, వెంకట్‌రెడ్డి, రాజు, శ్రీనివాస్, సర్పంచులు లలిత, పాషా, పాండు, రుక్కీబాయి, గోవర్ధన్, చంద్రయ్య, హైదర్, శివలీల, శ్రావణ్‌కుమార్, నర్సింహులు, మోహన్ రెడ్డి, నాయకులున్నారు.