న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ;ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది మట్టి గణేశ్లకే జైకొట్టారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలించింది. విద్యుద్దీపాల మధ్య ప్రత్యేకాలంకరణతో ఏర్పాటు చేసిన మండపాల్లో మట్టి గణనాథుల ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి పూలు, పండ్లు, ధూప, దీప, నైవేద్యాలతో పాటుగా ఉండ్రాళ్లను సమర్పించారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ.. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుపై అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. మట్టి వినాయకుడిని పూజించడమంటే ప్రకృతిని పూజించడంతో సమానం. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలన్నదే రాష్ట్ర సర్కార్ ఉద్దేశం.
భక్తుల కోలాహలం..మేళతాళాలు…వేదపండితుల మంత్రోచ్ఛారణ లు.. భజన సంకీర్తనల మధ్య భూలోకంలో గణనాథుడు కొలువుదీరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతిఏడాది మాదిరిగానే ఈ ఏటా కూడా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఆదిదేవుడు వినాయకుడి విగ్రహాలను మండపాల్లో వివిధ రూపాల్లో ప్రతిష్ఠించారు. భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన మండపాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలను అధికంగా ప్రతిష్ఠించారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలించింది.
రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుపై అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. మట్టి గణపతే.. మహా గణపతి అని పలువురు పేర్కొంటున్నారు. పేపర్‌తో చేసిన ప్రతిమలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రజాప్రతినిధులు, భక్తులు ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా గణపతి బప్పా మోరియా ..దండాలయ్య.. ఉండ్రాలయ్యా అంటూ నినాదాలు మార్మోగాయి. మండపాల వద్ద నిర్వాహకులు అన్నదానం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా పోలీసులు బందోబస్తు నిర్వహి స్తున్నారు.