పెద్దేముల్, జనవరి 23 : మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న గ్రామసభలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లను తలపిస్తున్నాయి. మొదటిరోజు జరిగిన గ్రామసభ గోపాల్పూర్ గ్రామంలో తప్పా.. మిగిలిన గ్రామాల్లో స్టేజీలు వేసి.. వాటి పై కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు దర్జాగా కూర్చుని అధికారులతో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. తాజాగా గురువారం మంబాపూర్ గ్రామంలో జరిగిన గ్రామసభలోనూ అదే తంతు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు స్టేజీపై కూర్చున్నారు.
అధికారులు, నాయకులకు ఎదురు చెప్పలేక.. వారు చెప్పిందే వేదంలా కానిచ్చేస్తున్నారు. అధికారులు ప్రజలకు చెప్పాల్సిన సమాధానాలను కూడా వారే మధ్యలో కల్పించుకుని చెప్పడం పలు విమర్శలకు దారి తీస్తున్నది. ఈ విషయం లో కాంగ్రెస్ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నా యకులకు మధ్య గొడవ జరుగగా పోలీసులు కలుగజేసుకొని గొడవ పెద్దది కాకుండా చేశారు. ఇక శుక్రవారం జరిగే గ్రామసభలనైనా అధికారులు సక్రమంగా నిర్వహిస్తారో లేదో చూడాలి.