పరిగి, జూన్ 11 : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదని మండలంలోని రాపోల్ గ్రామ రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు భూసేకరణ నిమిత్తం గురువారం రాపోల్లో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భం గా రైతులందరూ ముక్తకంఠంతో మా భూములు కంపెనీల కోసం ఇవ్వబోమన్నారు. భూములిచ్చి అడుక్కు తినాలా..? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు, మూ డు పంటలు పండే సారవంతమైన భూ ములు కాకుండా గుట్టలుగా ఉన్నటువంటి అసైన్డ్ భూములను చదునుచేసి కంపెనీలు పెట్టాలన్నారు.
రేడియల్ రోడ్డు వస్తుందంటే మా భూములు ఇస్తామని.. ఇప్పుడు కంపెనీలు పెట్టి, తమనే రోడ్డుపాలు చేస్తామంటే ఎలా అని అధికారుల ను ప్రశ్నించారు. తామ తాతల కాలం నుంచే ఈ భూములనే సాగు చేసుకుని జీవిస్తున్నామని.. అవి లేకుంటే బతకలేమన్నారు. గ్రామసభలో మాట్లాడిన రైతులందరూ తమ భూము లు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు. మీ కాళ్లు మొక్కుతాం భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభలో కాంగ్రెస్ నాయకుడు నాగవర్ధన్ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఒక్కసారిగా అక్క డ ఉన్న రైతులందరూ రాజకీయాలు అవసరం లేదని, ప్రస్తుత అంశంపైనే మాట్లాడాలని సూచించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య రాపోల్లో అధికారులు గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ రఫీఖ్, డిప్యూటీ జోనల్ మేనేజర్ శేషగిరిరావు, పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, రెవెన్యూ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
రైతులు చెప్పిన అంశాలపై నివేదిక అందజేస్తాం
గ్రామసభలో రైతులు చెప్పిన ప్రతి అంశాన్నీ నివేదిక రూపంలో అధికారులకు అందిస్తామని వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర అన్నారు. గురువారం రాపోల్లో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు రాపోల్లో అసైన్డ్ భూములు 509 ఎకరాలు, 101 పట్టా భూ ముల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామసభలో ప్రతి రైతూ చెప్పిన అంశాలన్నీ రాసుకోవడం జరిగిందని, వాటన్నింటినీ మీ అభిప్రాయంగా పరిగణిస్తామన్నారు. అసైన్డ్ భూమికి సంబంధించి ఎవరైనా రైతులు భూమి ఇచ్చేందుకు ముందుకొస్తే కలెక్టర్ సమక్షంలో కాన్సెంట్ అవార్డు పాస్ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన వినతిపత్రాలన్నీ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. కంపెనీలు ఏర్పాటు చేసే ముందు స్కిల్ ఉన్నవారికి, అన్‌స్కిల్డ్ వారికి ఆయా రంగాల్లో ఉద్యోగావకాశాలు ఇవ్వాలన్నది కండిషన్ పెట్టి ఇస్తారన్నారు.
-వాసుచంద్ర, వికారాబాద్ ఆర్డీవో
భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేం..
ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేం. మీరు ఉద్యోగాలు ఇస్తారా?, ఇవ్వరా తర్వాతి ముచ్చట. తాత లు, ముత్తాతల కాలం నాటి నుంచి తమ కుటుంబాలు ఈ భూములనే సాగు చేసుకుని జీవిస్తున్నాయి. మా గ్రామంలో సారవంతమైన భూములున్నాయి. మూడు పంటలు సైతం పండుతాయి. దాదాపు 300మంది రైతులందరం వికారాబాద్ కలెక్టరేట్కొస్తే కనీసం మా నుంచి వినతిపత్రాన్ని కూడా కలెక్టర్ తీసుకోలేదు. మా వినతిపత్రాన్ని తీసుకోలేనివారు మాకు ఉద్యోగాలు ఇస్తారని ఎట్ల నమ్మాలి?. రాకంచర్లలో పారిశ్రామికవాడ పేరిట భూములు తీసుకొని ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పరిశ్రమలే ఏర్పాటు చేయలేదు. ఎమ్మెల్యే రామ్మోమోహన్రెడ్డి సొంతూరు శివారెడ్డిపల్లిలో 2000 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములు తీసుకోండి.
-రవి, మాజీ వైస్ ఎంపీపీ
మా పిల్లలను ఎలా చదివించాలి
మాకు రెండెకరాల భూమి ఉన్నది. దానిని మీరు గుంజుకుంటే మా ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో కూలీ పనులుచేసి పిల్లల్ని బీటెక్ చదివిస్తున్నా. ఈ పరిస్థితిలో మీరు భూమి తీసుకుంటే మా బతుకులు ఆగం ఆవుతాయి. మాకు భూమి తల్లిలాంటిది, మీరు భూమి తీసుకుంటే అమ్మనాన్న చనిపోయినట్లే మాకు. చచ్చిపోతే బొందలు పెట్టడానికి జాగ కూడా కావాలి. మా భూములు గుంజుకునే ఆలోచన విరమించుకోండి. -శివకుమారి, మహిళా రైతు
భూమి ఉంటేనే మాకు ధైర్యం
భూమి ఉంటే మాకు ఒక ధైర్యం. నాకు 2.26 ఎకరాల భూమి ఉన్నది. నాకు ఇద్దరు కూతుళ్లు, ఆ భూమిలో బోరు వేసుకొని పంటలు సాగు చేస్తున్నా. నేను దివ్యాంగుడ్ని, ఆ భూమి లేకపోతే నాకు ఎవరు గంజి పోయరు. మా భూముల దగ్గరకు రాకండి, ఆ భూములుంటే రేపటి రోజున ఎవరైనా పది రూపాయలు అప్పుగా ఇస్తారు. మీ కాళ్లు మొక్కుతాం సార్, మాపై దయ ఉంచి మా భూములు మాకు ఉండేలా చూడండి. -మాసుల ముత్లిబ్, రైతు
రింగ్‌రోడ్డు దగ్గరుందని మమ్మల్ని రోడ్డున పడేస్తున్నారు..
రింగ్‌రోడ్డు దగ్గరుందని చెబుతూ భూములు గుంజుకొని, మమ్మల్ని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. భూములు పోతే మేము చిప్పలు పట్టుకొని అడుక్కోవాలి. ఇక్కడున్న వారిలో 80 శాతం మంది వ్యవసాయదారులే. మమ్మల్ని ఆగం చేయొద్దు. మా బతుకులు మేము బతుకున్నాం. మాకు ఉన్నదే రెండెకరాల భూమి, అందులో నలుగురు అన్నదమ్ములకు 20 గుంటల చొప్పున భూమి వస్తుం ది. రిటైర్డ్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఫామ్ వేశా. నాకు జాబ్ ఇస్తామంటే ఏమి చేయాలి. వ్యవసాయం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మీరు భూములు గుంజుకుంటే పిల్లలను ఎలా చదివించాలి. ఉన్న భూమిని మీరు గుంజుకుంటే నా కొడుకును ఎలా చదివించాలి.
-కంచి గోపాల్, రిటైర్డ్ సీఆర్పీఎఫ్