రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నది. రాజకీయ హడావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధ్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు, కేంద్రం నుంచి వచ్చే నిధులు నెలనెలా అందడం లేదు. ఫలితంగా నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసింది. ప్రత్యేక అధికారులు చుట్టపు చూపుగా వస్తుండగా.. పంచాయతీ కార్యదర్శులపైనే పనిభారం పడుతున్నది. పంచాయతీ సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ట్రాక్టర్లకు కిస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొనడంతో పారిశుద్ధ్య, తాగునీటి నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా మారి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లోనూ పాలన తిరుగోమన దిశగా సాగుతున్నది. రోజురోజుకూ పెరిగిపోతున్న సమస్యలతో పదేండ్లుగా మాయమైపోయిన కష్టాలు నేటి కాంగ్రెస్ పాలనలో మళ్లీ ప్రత్యక్షమై పల్లె ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.
– రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. మండల, డివిజన్ స్థాయిలోని గెజిటెడ్ ఉద్యోగులకు మూడు కంటే ఎక్కువ పంచాయతీలను అప్పగించారు. ఈ లెక్కన జిల్లాలోని 558 గ్రామపంచాయతీల పగ్గాలను ప్రభుత్వం 252 మంది ప్రత్యేకాధికారులకు అప్పగించింది. అయితే ఆయా అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనిభారంతోనే సతమతమవుతుండడంతో అదనంగా పంచాయతీల బాధ్యతలను చూడడంలో ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ నీటి సరఫరాలోనూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. పారిశుద్ధ్యం సైతం అస్తవ్యస్థంగా మారింది. నర్సరీల నిర్వహణ, హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ సైతం ఉండడం లేదు. పంచాయతీల ఖర్చుల విషయంలో ప్రత్యేకాధికారులు చేతులెత్తేస్తుండడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతున్నది. ఇదేక్రమంలో ప్రజా సమస్యలు సైతం సత్వరం పరిష్కారం కావడం లేదు.
పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతుండడంతో పల్లెలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుత వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. విష జ్వరాలతోపాటు డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 8,960 వరకు వివిధ రకాల జ్వరాలు నమోదుకాగా.. 119కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికీ.. అదీ మొక్కుబడిగానే సాగింది. రాబోయే రోజుల్లోనూ పారిశుద్ధ్య పరిస్థితి ఇలాగే ఉంటే.. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలకు ఆస్తి పన్ను, ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థికసంఘం ద్వారా నిధులు సమకూరుతున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు అవసరం మేర విడుదల కావడం లేదు. గతంలో ప్రతినెలా నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, పైపుల లీకేజీ మరమ్మతులు, ట్రాక్టర్ కిస్తీలు, వీధి దీపాల నిర్వహణ, విద్యుత్తు బకాయిలు వంటి వాటికి ప్రతి నెలా నిధులను ఖర్చు చేయాల్సిందే. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే ఎలాగోలా సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. అత్యవసర పనులను చేపట్టే సందర్భాల్లో అప్పుచేసి మరీ చెల్లింపులు జరుపుతున్నారు. కొత్తగా అభివృద్ధ్ది పనులను సైతం చేపట్టే పరిస్థితి లేకుండా పోతున్నది. గత ఏడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులు పెండింగ్లో ఉండగా.. పదిహేను రోజుల క్రితం రూ.7.56 కోట్ల ఎస్ఎఫ్సీ నిధులు విడుదల అయ్యాయి. రెండు రోజుల క్రితమే రూ.7.83 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అయితే వచ్చిన ఈ కొద్దిపాటి నిధులు ఏ మూలకు సరిపోవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వచ్చిన ఈ కొద్దిపాటి నిధులు పాత బకాయిలకే సరిపోతాయని, మళ్లీ అప్పుచేయక తప్పదని పలువురు అధికారులే బాహాటంగా పేర్కొంటున్నారు.