బొంరాస్పేట/ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 28 : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం గత కొద్ది రోజులుగా గ్రామాల్లోని వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందించింది. ఈ నెల 6వ తేదీన గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఆ తరువాత 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రదర్శించిన జాబితాలో తప్పుల సవరణకు, అభ్యంతరాలకు సమయం ఇచ్చారు.
అధికారులు వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను శనివారం ప్రకటించారు. అధికారులు ప్రకటించిన తుది జాబితా ప్రకారం వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 585 గ్రామ పంచాయతీలు ఉండగా 4982 వార్డులు ఉన్నాయి. కులకచర్లలో అత్యధికంగా 49,212 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా బంట్వారం మండలంలో 17,278 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 6,71,940 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,32,038 మంది కాగా, మహిళా ఓటర్లు 3,39,885 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.
జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి పాలన కొనసాగిస్తున్నది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికలకు సంబంధించి ముందస్తు కార్యాచరణలో భాగంగా ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కూడా వార్డులు, పంచాయతీల రిజర్వేషన్ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తేనే ఎన్నికల నిర్వహణకు అడుగులు ముందుకు పడుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కులగణన పూర్తి చేసిన తరువాతే రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లాలో..
ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 28 : రంగారెడ్డి జిల్లాలోని 549 గ్రామపంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీరాజ్ అధికారి సురేశ్మోహన్ శనివారం తెలిపారు. గ్రామపంచాయతీ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీ కార్యదర్శులు తమకు చెందిన గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డుపై అంటించాలన్నారు.
ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రజలు పరిశీలనార్థం ప్రచురించారని తెలిపారు. జిల్లాలో 7,94,651 ఓటర్లకు గానూ పురుషులు 3,99,404, స్త్రీలు 3,95,214, ఇతరులు 33 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ముసాయిదా జాబితాపై వచ్చిన 10,441 అభ్యంతరాలను పరిష్కరించామన్నారు.
పేర్లను గ్రామపంచాయతీల్లోని వార్డులకు ఇంటి నంబర్ వారి వరుస క్రమంలో చేర్చి వారివారి ఓటర్ల జాబితాను తయారు చేయగా, ఎంపీడీవో, జిల్లా సహాయ ఎన్నికల అధికారులు టీ పోల్లో అప్లోడ్ చేయగా, గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి పోల్లో ఆమోదించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల్లో విలీనమైన 12 గ్రామపంచాయతీల ఓటరు జాబితా ప్రచురించలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 79,4651 ఓట్లు ఉండగా, మొత్తంగా జిల్లాలో 399404 పురుష ఓటర్లు, 395214 మహిళలు ఉన్నారు. ఇతరులు 33 మంది ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు.