One Piece Season 2 Trailer |ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైవ్-యాక్షన్ సిరీస్ ‘వన్ పీస్’ రెండో సీజన్ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ 2 మార్చి 10న స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ తాజా ట్రైలర్లో మంకీ డి. లూఫీ మరియు అతని ‘స్ట్రా హాట్’ గ్యాంగ్ అత్యంత ప్రమాదకరమైన ‘గ్రాండ్ లైన్’ సముద్ర మార్గంలోకి ప్రవేశించడంతో పాటు. ప్రపంచంలోనే అత్యంత విలువైన నిధి ‘వన్ పీస్’ కోసం వారు సాహసం చేయబోతున్నారు. ఈ ప్రయాణంలో వింతైన దీవులు, ఊహించని శత్రువులు మరియు అద్భుతమైన సాహసాలు ఎదురుకాబోతున్నాయి. మొదటి సీజన్ కంటే ఈసారి యాక్షన్, సస్పెన్స్ మరింత రెట్టింపు ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
జపనీస్ రచయిత్రి ఐచిరో ఓడా రాసిన ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మాంగా ఆధారంగా రూపొందిన ఈ సిరీస్, 2023లో విడుదలైన మొదటి సీజన్‌తోనే 75 దేశాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచి గ్లోబల్ ఫినామినన్గా మారింది. ముఖ్యంగా కొత్త సీజన్లో అభిమానులందరికీ ఇష్టమైన ‘టోనీ టోనీ చాపర్’ పాత్ర లైవ్-యాక్షన్‌లో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇనాకి గొడోయ్, మెకిన్యు, ఎమిలీ రడ్ వంటి ప్రధాన తారాగణంతో పాటు కొత్తగా కేటీ సాగల్, జో మాంగనీల్లో వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.