పెద్దేముల్, డిసెంబర్ 3 : పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తు తెలియని వ్యక్తులు క్లస్టర్ కార్యాలయం నుంచి ఎత్తుకెళ్లారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జైరాంతండా (ఐ)పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు గోట్లపల్లి గ్రామంలో నాలుగు పంచాయతీలకు కలిపి ఒక కస్లర్టర్గా ఏర్పాటు చేశారు. మొదటి విడత జరుగుతున్న ఎన్నికలకు బుధవారం నామినేషన్ల ఉపసంహరణ కాగా మంగళవారం రాత్రి గోట్లపల్లి పంచాయతీ కార్యాలయం తాళం పగులగొట్టి అందులో ఉన్న గిర్మాపూర్, హన్మాపూర్, జైరాంతండాకు సంబంధించిన నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.
ఉదయం కార్యాలయానికి వచ్చిన పంచాయతీ కార్మికుడు లోపలికి వెళ్లిచూడగా నామినేషన్ పత్రాలు చిందరవందరగా కిందపడి ఉన్నాయి. వాటిని చూసిన కార్మికుడు అన్నింటిని తీసి తిరిగి టేబుల్‌పై పెట్టేశాడు. అధికారులు వచ్చాక విషయం చెప్పడంతో పత్రాలు పరిశీలించిన అధికారులు అవాక్కయ్యారు. వెంటనే అధికారులు ఎంపీడీఓకు, పోలీసులకు సమాచారమిచ్చారు. పెద్దేముల్ ఎస్ఐ శంకర్ అక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత విషయం తాండూరు డీఎస్పీకి వివరించారు. అంతలోపు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ క్లస్టర్ కార్యాలయాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని చెప్పి వెళ్లిపోయాడు. అనంతరం తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి కోటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.