ధారూరు, మే 27 : మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేరిగడ్డతండా, జీడిగడ్డతండా, గురుదొట్ల్ల, నాగారం, నాగసముందర్, మోమిన్‌కలాన్, గట్టేపల్లి, రాంపూర్‌తండా తదితర గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం తడిసిపోయింది. కేంద్రాల నిర్వాహకులు వడ్లను తూకం వేయకపోవడంతో అన్నదాతలు వడ్ల కుప్పల వద్దే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు.
వడ్లను ఆరబెట్టి.. కొనుగోలు కేంద్రానికి తీసుకొద్దామంటే సరిపడా సంచులు అందుబాటులో లేవని.. అవి వచ్చే వరకు తీసుకురావద్దని సూచిస్తున్నారు. అంతేకాకుండా తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించకపో వడంతో అకాల వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయని.. పంట నీటి పాలు అవుతుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.