కొడంగల్, మే 3 : రేవంత్‌రెడ్డి పాలన ప్రజాపాలనగా చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని, ప్రజా వ్యతిరేక పాలనగా చెప్పుకోవడం సమంజసంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలంలోని మెట్లకుంట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని వరి కుప్పల మధ్య అన్నదాతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో ప్రజలకు అన్నింటా ఇబ్బందులకు గురి చేసిందని.. ప్రజాపాలన విజయోత్సవాలు కాంగ్రెస్ నాయకుల కోసమే చేసుకొంటున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. ఎందుకంటే ప్రజలకంటే కాంగ్రెస్ నాయకులే అన్నింటా ఆర్థికంగా, అధికారికంగా బాగుపడ్డారని పేర్కొన్నారు.
ప్రజలు మాత్రం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా..? చేతకాని సీఎంతో అన్నింటా తంటాలు పడుతున్నట్లు గోస వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల్లోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిపోయిందని, ప్రజలు సంక్షేమ ఫలాలను అందుకోలేక మోసానికి గురౌతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలి.. కమీషన్లు వచ్చే అభివృద్ధి పనులు చేస్తూ.. కాంగ్రెస్ నాయకులు తమ జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాపాలన కాదు.. రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్నదన్నారు.
వరి ధాన్యం కోతలు ప్రారంభమై 20 రోజులకు పైగా కావస్తున్నా నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, దాంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాసులు కుప్పలుకుప్పలుగా పేరుకుపోయినట్లు పేర్కొన్నారు. సంవత్సరంలో మూడు పంటలకు రైతు భరోసా అందిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ అన్నదాతలకు హామీ ఇవ్వడం జరిగిందని, మూడు పంటలకు దేవుడెరుగు కానీ ఒక్క పంటకూ దిక్కులేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. పంట సమయంలో అందించాల్సిన రైతు భరోసా కేసీఆర్, హరీశ్‌రావుల మీటింగ్ సందర్భంగా ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో రెండు పర్యాయాలు రైతు భరోసా అందించడం జరిగిందన్నారు.
రైతు బీమా అమలు ఏ కోశానా కనిపించడంలేదని, రైతు రుణమాఫీ కనీసంగా 30 శాతం కూడా అమలు కాలేదని ఆరోపించారు. ఏ ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ చేసినట్లు రుజువు చేస్తే వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌లో బీఆర్ఎస్ పోటీ చేయదని సవాల్ విసిరారు. పచ్చటి పంటలు పండే భూములను అభివృద్ధి పేరుతో అన్నదాతల నుంచి లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం పలుకుతున్నట్లు పేర్కొన్నారు. మొదటి నుంచి రియల్ వ్యాపారి కాబట్టే రేవంత్ సీఎం అయినా అదే బుద్ధి ఉందన్నారు.
కేసీఆర్ పాలనలో రైతులు గోసపడ్డ రోజులు ఏనాడూ లేవని, అన్నదాతకు ఏది కావాలో ఆ సమయంలోనే బీఆర్ఎస్ సర్కారు అన్నింటా సౌకర్యాలు కల్పించిందన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజక్టుల నిర్మాణాలు చేపట్టి దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా గిట్టుబాటు ధరలను కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమచేసి వారి ఇంట్లో సిరుల పంట కురిపించినట్లు చెప్పారు. కరోనా సమయంలోనూ అన్నదాతల ఖాతాల్లో నగదు జమచేసినట్లు తెలిపారు.
నేడు అన్నింటా సౌకర్యాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదంటే, ఎంత చేతకాని ప్రభుత్వమో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం రైతులు 20 రోజుల క్రితం కోతలు ప్రారంభించి వరి ధాన్యాన్ని కల్లాల్లో, ఇంటి ముందు, రోడ్లుపై రాసులుగా పోసుకొని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. సర్కారు మెడలు వంచి పండిన ప్రతి గింజ కొనుగోలు చేయించడం ఖాయమని, ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండల మాజీ అధ్యక్షులు యాదగిరి, చాంద్‌పాషా, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు, మాజీ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్ పాల్గొన్నారు.
వరి కోసి 20 రోజులవుతున్నది. కొనేవారు లేక రోడ్డుపై వరి పంటను వేసుకొని ఎదురుచూస్తున్నాం. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదు. అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని ప్రసంగాలు చేస్తారు కానీ ఆచరణలో ఏముండదు. పంట సాగుకు రైతు భరోసా రాదు.. రుణమాఫీ లేదు.. రేవంత్‌రెడ్డి సీఎం అయితే మాకు మేలు జరుగుతుందని అనుకున్నాం. కానీ ఏం లాభం లేదు. అన్నింటా ఇబ్బందులు తప్పడంలేదు.
– బైరం కిష్టయ్య, బొంరాస్‌పేట మండలం, కొడంగల్
రైతులంటే నాయకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం 20 రోజులుగా వేచి చూస్తున్నా. నేటికీ ఏ ఒక్కరూ పలకరించడంలేదు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. వర్షం వస్తే మా అన్నదాతల బతుకులు ఆగం, ధాన్యం తడిస్తే కొనేందుకు ఇంకింత ఇబ్బంది చేస్తారు. తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నాం. కేసీఆర్ కాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కేసీఆర్ సార్ ఒక్కసారి సాగు చేసేటప్పుడు రూ.10వేలు ఇచ్చేవారు. ఇప్పుడు సర్కారు కుదిరినప్పుడు రూ.6వేలు ఇస్తున్నది.
– వెంకటమ్మ, తుంకిమెట్ల, బొంరాస్‌పేట, కొడంగల్
కేసీఆర్ కాలంలో సాగు చేసే సమయంలో రైతు బంధు వచ్చేది. దాంతోనే ఎవరి ముందు చేయి చాపకుండా ధీమాగా వ్యవసాయం చేసుకునేవాళ్లం. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే అప్పు తీసుకోక తప్పడంలేదు. కష్టపడి పంటలను పండించుకుంటే అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ పాలనలో కోతలు జరుగుతుండగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. వారం రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి. ఇప్పుడు కష్టకాలం వచ్చింది. వ్యవసాయం చేయాలంటే గోసపడాల్సి వస్తున్నది.
– నర్సింహులు, తుంకిమెట్ల, బొంరాస్‌పేట, కొడంగల్
వడ్లు కొని అన్నదాతల కష్టం తీర్చాలని కోరుతున్నాం. కోతలు చేపట్టి 20 రోజులవుతున్నది. వడ్లు కొనేవారి కోసం ఎదురుచూస్తున్నాం. మెన్న వచ్చిన వర్షానికి వడ్లు తడిసిపోయాయి. మళ్లీ వాటిని కష్టపడి ఆరబెట్టుకొన్నాం. సంచులు లేవు. అడిగేవారు లేరు. ఎప్పుడు కొంటారో తెల్వదు. అప్పటిదాగా మాకీ కష్టాలు తప్పవు. వడ్లు పండించడం ఓ ఎత్తైతే.. వాటిని అమ్ముకోవాలంటే అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నది. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదు.
– హన్మయ్య, బొంరాస్‌పేట మండలం, కొడంగల్