ఇబ్రహీంపట్నంరూరల్, మే 10 : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. దండుమైలారం సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని రాయపోల్, దండుమైలారం గ్రామాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, దండుమైలారం సహకార సంఘం చైర్మన్ బిట్ల వెంకట్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతాంగ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపటం కోసం ప్రభుత్వం అడుగడుగునా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరతో మంచి లాభాలు గడిస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య మాట్లాడుతూ..
రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కో ఆపరేటివ్ డీసీవో ధాత్రి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శాంత, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, సర్పంచ్‌లు మల్లీశ్వరి, బల్వంత్‌రెడ్డి, ఎంపీటీసీలు అనసూయ, జ్యోతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ, సహకార సంఘం వైస్ చైర్మన్ ఈశ్వర్, ఏవో వరప్రసాద్‌రెడ్డి, ఏఈవో శ్రవణ్‌కుమార్, సహకార సంఘం సీఈవో ధన్‌రాజ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.