షాద్నగర్ : ప్రైవేట్ దవాఖానల్లో అందే వైద్య సేవలకంటే మరింత మెరుగైన వైద్య సేవలు సర్కారు దవాఖానల్లో అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని సర్కారు దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీయూ వైద్య సేవల విభాగాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలను విస్తృతపర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందని, గతంలో కనీస మౌలిక వసతులు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఆరోగ్యశ్రీని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు సర్కారు దవాఖానల్లో గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ సమస్యలు వంటి వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తృతం చేశారని చెప్పారు. కొవిడ్ వ్యాధి వ్యాప్తిని పూర్తి స్థాయిలో నివారించేందుకు రాష్ట్ర వైద్య శాఖ చేపట్టిన ఇంటింటి జ్వరం సర్వే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని, రాష్ట్ర ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమని అన్నారు. షాద్నగర్ పట్టణంలో ఐసీయూ వంటి వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని, రానున్న రోజుల్లో ట్రామ కేర్, డయాలసిస్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ బచ్చలి నర్సింహ, నాయకులు మన్నె నారాయణ, రాజావరప్రసాద్, పాపయ్యయాదవ్, జూపల్లి శంకర్, శ్రీకాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.