వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో సుమారు లక్ష ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అడవుల్లో ఇప్పటికే 50 రకాల ఔషధ మొక్కలున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది జరుగనున్న హరితహారంలో భాగంగా మరిన్ని ఔషధ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెమలినార, నారవేపి, బూరుగ, కానుగ, రావి, అల్లనేరేడు, మర్రి, చింత, జువ్వి, ఇప్పా, నారవేప, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, ఏరుమద్ది, నల్లమద్ది, టేకు, చిందుగ, సీతాఫల్, ఉసిరి, మారేడు, జిల్లేడు తదితర ఔషధ మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అటవీ శాఖ నర్సరీల్లో అవసరమైన మొక్కలను సైతం సిద్ధం చేస్తున్నారు.
వికారాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): అనంతగిరికా హవా..లాకో మరీజోంకా దవా(అనంతగిరి గాలి లక్షల రోగాలకు మందు) అనే నానుడి ఉన్నది. ఔషధ మొక్కలకు అనంతగిరి అడవులు ప్రసిద్ధి. అనంతగిరి అడవుల్లోని ఔషధ మొక్కల గాలితో శ్వాస సంబం ధిత రోగాలు గత కొన్నేండ్లుగా నయమవుతున్నాయి. అనంతగిరి ప్రాంతంలోని గాలిని పీల్చితే చాలు ఎక్కువ కాలం బతుకుతామని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. దీంతో ప్రభుత్వం ఇక్కడ టీబీ దవాఖానను ఏర్పాటు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నది. దీంతో ఇక్కడ చికిత్స పొందేందుకు తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. 1500 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అడవుల్లో 50 రకాల ఔషధ మొక్కలున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రానున్న హరితహారంలో మరిన్ని ఔషధ మొక్కలను నేటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లక్ష ఔషధ మొక్కలు నాటేందుకు..
అనంతగిరి అటవీ ప్రాంతంలో రానున్న హరితహారం కార్యక్రమంలో లక్ష ఔషధ మొక్కలను నాటాలని జిల్లా అటవీశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే అడవిలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించిన అధికారులు .. ఆ ప్రాంతాల్లో మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని హరితహారం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. అనంతగిరి అడవుల్లోని 50 రకాల ఔషధ మొక్కల్లో వేప, కాచు, దర్శనం, అల్లనేరేడు, వేరుమద్ది, ఉసిరి, రావి, నెమలినార, కానుగ, తెల్ల విరుగుడు, మర్రి, మేడి, నారవేప, చిన్నంగి, ఇప్పా, మా మిడి, జీడి, దొరిసేన, గన్నేరు, చిల్లగింజ, చింత, టేకు, కరక్కాయ, ఇనుముద్ది, అంకుడు చెట్టు, పెద్ద రేగు, పెద్ద గుమ్ముడు టేకు, కలేచెట్టు, పసుపు, పెద్దమాను, చిందు గ, చిరుమాను, చారుమామిడి, మోదుగ, జిల్లేడు తదిత ర ఔషధ మొక్కలున్నాయి. వీటితోపాటు అప్లూడ మల్టి కా, ఏషియన్ స్పైడర్ఫ్లవర్ వంటి ఔషధ మొక్కలు, వాటితోపాటు తీగ జాతి ఔషధ మొక్కలు కూడా అనంతగిరి అడవుల్లో ఉన్నాయి.
అరుదైన పక్షులు..
అనంతగిరి అడవుల్లో ఔషధ మొక్కలతోపాటు అరుదైన పక్షులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నన్నీ అరుదైన పక్షిజాతులు ఎక్కడా లేవని సంబంధిత అధికారులు పే ర్కొంటున్నారు. హిమాలయాలు, అస్సాం అడవుల్లో మాత్రమే ఉండే ప్యారడైజ్ ఫ్లైక్యాచర్ అనే ప్రత్యేక పక్షి జాతితోపాటు సెవెన్ సిస్టర్స్ అనే పక్షులు కూడా అనంతగిరి అడవుల్లో ఉన్నాయి. అదేవిధంగా టైలర్ పక్షులు(లిక్కు జిట్ట), రాబిన్(ఎరుపు చారలు ఉన్న పిట్ట), వేజ్టైల్, సన్బర్డ్, కంజులు తదితర ఎన్నో రకాల పక్షులున్నాయి. అంతేకాకుండా జిల్లాలోని అడవుల్లో 100 కుపైగా వివిధ రకాల చిలుక జాతులున్నాయి. కొత్త రకాల చిలుక జాతులు అనంతగిరి అడవుల్లో కనువిందు చేస్తుంటాయి. వీటితోపాటు జింకలు, అడవి గొర్రెలు, కుందేలు, హైనా, అడవి పిల్లి, నక్కతోపాటు వివిధ రకా ల విషసర్ఫాలు, అడవి పందులు ఇక్కడ ఉన్నాయి.