వికారాబాద్, ఆగస్టు 24 : నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణంపై పునరాలోచించాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ముద్ద వీర మల్లప్ప కన్వెన్షన్ హాల్లో (ఏఐకేఎంఎస్) అఖిల భారత రైతు కూలి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ కోటేశ్వరరావు, వెంకన్న మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం 12 లక్షల చెట్లను కొట్టివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అడవులను సంరక్షించాలని తెలిపారు. నిరుపయోగమైన భూములు దేశంలో ఎన్నో ఉన్నాయని, అలాంటి చోట రాడార్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పిందని, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని, వారికి కూడా పెట్టుబడి సాయం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, నాయకులు డేవిడ్ కుమార్, నాగేశ్వరరావు, భూమన్న, సారంగపాణి, నర్సయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.