వికారాబాద్, ఆగస్టు 12, (నమస్తే తెలంగాణ): వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు. వరుసగా ఏదో ఒక శాఖకు చెందిన అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నా.. అధికారులు లంచాలు తీసుకోవడం మాత్రం మరవడం లేదు. ప్రతి పనికీ తగిన విధంగా ఆయా శాఖల అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే అండ్ భూ రికార్డులు, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యుఎస్, మున్సిపల్ శాఖల్లో ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పనిదే పనులు జరగని విధంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు తయారయ్యారు.
అయితే తాజాగా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ ఇ-సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుజాత నవాబుపేట్ మండలం వట్టిమీనపల్లికి సంబంధించిన రెండెకరాల అసైన్డ్ భూమి ప్రొసీడింగ్ ఆర్డర్‌ను తహసీల్దార్ కార్యాలయానికి పంపించేందుకుగాను రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మరోవైపు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అవినీతికి పాల్పడితే కటకటాలు తప్పవని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
లంచమిస్తేనే పనిలో కదలిక…
లంచమిస్తేనే పని జరుగుతుందనే విధంగా తయారయ్యారు కొందరు ప్రభుత్వ అధికారులు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కింది స్థాయి ఉద్యోగుల నుంచి అధికారుల వరకు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అయితే భూ సమస్యల పరిష్కారంలో రైతుల నుంచి రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి దోచుకుంటున్నారు. భూ సమస్యల పరిష్కారంలో ఆర్ఐ రిపోర్ట్, తహసీల్దార్ అప్రూవల్ తప్పనిసరి కావడంతో చాలా మండలాల్లో డబ్బులిస్తేనే పనులు చేస్తున్నారు.
డబ్బులివ్వకపోతే ఆయా మండలాల తహసీల్దార్లు అన్ని సరిగ్గా ఉన్నా ఏదో ఒక కొర్రీలు పెడుతూ రిజెక్టు చేసేలా రిపోర్టులు పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ డబ్బులు ఇవ్వనట్లయితే తప్పుడు రిపోర్టులు పంపుతూ చేతులు దులుపుకుంటున్నట్లు వినిపిస్తుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్లకు వచ్చే వారిని సైతం తహసీల్దార్లు వదలడం లేదు, ఉదయం స్లాట్ ఉన్నా సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపుతూ మండలాన్ని బట్టి రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ప్రతీ చిన్న పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని, డబ్బులివ్వని వారి ఫైళ్లను పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కొందరు తహసీల్దార్ల అవినీతి బాగోతం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ఏమి చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. వైద్యారోగ్య శాఖలో కూడా అవినీతి పెరిగిపోయిందనే ప్రచారం జోరందుకుంది.
వైద్యారోగ్య శాఖ కార్యాలయంతోపాటు క్లినిక్‌ల తనిఖీల సీజ్‌ల పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ప్రతి ఫైల్‌కు పైసలివ్వనిదే సంతకం పెట్టేది లేదని అధికారులు చెబుతుండడం విస్మయానికి గురిచేస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖలో సంబంధిత ఉద్యోగులు రిజిస్ట్రేషన్‌కు డబ్బులిస్తేనే సంతకాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సదరు అధికారులు నేరుగా కాకుండా ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్లతోపాటు తహసీల్దార్లు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.5నుంచి 10వేల వరకు వసూలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ శాఖలో అయితే ప్రతి పనికి కమీషన్ ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. ఆయా శాఖలను బట్టి 5 శాతం, 3, 2 శాతం మేర కమీషన్ ముట్టజెప్పాల్సిందే.
మున్సిపల్ శాఖలో చివరకు చెక్కుపై సంతకం చేసేందుకు కూడా రూ.2వేలు ఇస్తేనే సంబంధిత ఉద్యోగులు సంతకం పెడుతున్నట్లు కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖలో అయితే పై అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఎంత పర్సంటేజ్ ఇవ్వాలనేది ముందే చెబుతారట.
అవినీతిపరుల వివరాలు..
జిల్లాలో ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో అవినీతిపరులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. జిల్లాలో తాజాగా నవాబుపేట్ మండలం వట్టిమీనపల్లికి చెందిన రెండెకరాల అసైన్డ్ భూమి ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీని తహసీల్దార్ కార్యాలయానికి పంపించేందుకుగాను రూ.15 వేల లంచం తీసుకుంటూ కలెక్టరేట్లోని రెవెన్యూ ఇ-సెక్షన్ ఉద్యోగిని ఏసీబీకి పట్టుబడింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల అసైన్డ్ భూమిని తన తల్లి పేరిట మార్చేందుకుగాను తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫైల్‌ను పంపించగా, ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్‌కు అందజేసేందుకు రూ.5 వేల లంచం డిమాండ్ చేయగా, బాధితులు గూగుల్ పే ద్వారా జూనియర్ అసిస్టెంట్ సుజాతకు అందజేశారు.
అయితే కలెక్టర్ సంతకం తర్వాత ప్రొసీడింగ్ ఆర్డర్‌ను తిరిగి నవాబుపేట్ తహసీల్దార్ కార్యాలయానికి పంపేందుకు మళ్లీ రూ.20వేల లంచాన్ని డిమాండ్ చేయగా, బాధితుడు రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. మంగళవారం కలెక్టరేట్లోని రికార్డింగ్ రూం సమీపంలో బాధితుల నుంచి రూ.15వేల లంచం జూనియర్ అసిస్టెంట్ సుజాత తీసుకున్నది. అప్పటికే కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు సోదాలు చేసి రూ.15వేలను స్వాధీనం చేసుకొని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అదేవిధంగా మూడు నెలల క్రితం నాగసముందర్ గ్రామంలో డబ్బా ఏర్పాటు విషయంలో ఏర్పడిన పంచాయతీలో ధారూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ రూ.30వేలు లంచం తీసుకుంటూ డ్రైవర్‌తోపాటు ఏసీబీకి పట్టుబడ్డారు. ఐదు నెలల క్రితం ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంబంధిత కార్యాలయంలోని ఉద్యోగి పింఛన్ ఫైల్ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుడిన విషయం తెలిసిందే.
అదేవిధంగా ఏడాది క్రితం కలెక్టరేట్ కార్యాలయంలోని టీఎస్ఈడబ్ల్యుఐసీ కార్యాలయంలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పరిగి రోడ్డులో రూ.5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదేవిధంగా పరిగిలో విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటూ పట్టుబడగా, ఏడాది క్రితం ఓ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏఆర్ డీఎస్పీ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అదేవిధంగా గతంలో పరిగి డిప్యూటీ తహసీల్దార్ రూ.15వేలు లంచం తీసుకుంటూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏసీబీ అధికారులకు చిక్కారు.