సూర్యాపేట, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా పరిధిలోని కాళేశ్వరం ఆయకట్టు రైతులకు ఆపతి వచ్చిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో యాసంగిలో(నాలుగు సార్లు) వరి పంట ఎండుతూ వస్తోంది. చిన్నపాటి సాకు చూపి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం పండబెట్టి రైతుల నోట్లో మట్టికొడుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో నాటేసిన పొలాలకు గోదావరి జలాలు అందక పంటలు ఎండుముఖం పట్టడంతో దాదాపు 10 వేల ఎకరాల్లో పంట ఎండింది. నీళ్లు లేక నిత్యం వందలాది ఎకరాలు గొర్లు, పశువులకు మేతగా మారిపోతున్నాయి. దీంతో పెన్పహాడ్, ఆత్మకూర్.ఎస్, మోతె, మునగాల, నాగారం తదితర మండలాల్లో ఏదో ఒక చోట రైతులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. నీటి పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెల రోజుల్లో మరో లక్షకు పైగా ఎకరాల్లో వరి ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరంపై కుట్రలకు పాల్పడుతూ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతులకు కేసీఆర్ చెప్పిన విషయాల్లో తమకు ఏదైతే లబ్ధి జరుగుతుందనుకున్నారో దానిని కేసీఆర్ అన్ని విధాలుగా అమలు చేసి రైతులను సంతోషంగా ఉంచారు. బీఆర్ఎస్ హయాంలో నిరంతరాయంగా సాగు నీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలతో పాటు సాగు సీజన్ ప్రారంభానికి నెల ముందే పెట్టుబడి సాయం అందించారు. దీంతో రైతు కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిసేది. ఆ ఆనందం పట్టుమని పదేళ్లు కూడా నిలవలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి యాసంగిలోనే ప్రభుత్వానికి నీటి నిర్వహణ తెలియకపోవడం, నిర్లక్ష్యంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. అదే పరిస్థితి గత మూడు యాసంగి సీజన్లలో ఎదురైంది. ప్రస్తుతం నాలుగో యాసంగిలో సైతం కళ్లముందే కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడేండ్ల పాటు రైతులకు రెండు పంటలకు నీటిని అందించారు. మండు వేసవిలో సైతం వంద శాతం చెరువులు అలుగులు పారించి నీటి కరువు లేకుండా చేశారు. ఈ పరిస్థితిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనుమరుగు చేస్తోంది. మళ్లీ పూర్వ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి కరువు ప్రత్యక్షమవుతోంది.

సాధారణంగా వానలు కురవకపోతే కరువు వస్తుంది. కానీ చిన్న సాకు చూపించి నీటిని పారించే కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టి కరువుకు స్వాగతం పలికిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఎండిన వరిని గాలికి వదిలేసి ఇప్పుడిప్పుడే ఎండిపోబోతూ.. కాస్త పచ్చగా ఉన్న వరి పొలాలను రైతులు ఎకరా ఒక్కంటికి రూ.వెయ్యి నుంచి 1500లకు గొర్లు, పశువుల మేతకు విక్రయిస్తున్నారు. అంతే కాకుండా గత 40 రోజులుగా నాట్లు వేసిన పొలాలు దాదాపు 10 వేల ఎకరాల్లో ఎండిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో కాళేశ్వరం నుంచి వచ్చే జలాలకు సంబంధించి ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో కాల్వల ద్వారా నేరుగా నీరు పారేవి. దాదాపు 2.50 లక్షల ఎకరాలు ఉండగా ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటల కింద మరో 45వేలు ఎకరాలు మొత్తం 2.95 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ప్రభుత్వం పట్టింపులు మాని కాళేశ్వరం పంపులను ఆన్ చేసి ప్రస్తుతం ఉన్న ఎస్ఆర్ఎస్పీ జలాలకు సపోర్ట్ ఇవ్వకపోతే జిల్లాలో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
జిల్లాలో ఇప్పటికే 10వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది.ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో మరో లక్షకు పైగా ఎకరాల్లో పంట ఎండిపోయి తీవ్ర నష్టం చేకూరే ప్రమాదం పొంచి ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో సాగు అవసరాన్ని బట్టి 1800ల నుంచి 2100 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఈ సీజన్లో 500లతో ప్రారంభమై వెయ్యి క్యూసెక్కులను వారబందీ ప్రకారం విడుదల చేస్తున్నారు. దీంతో కొంతమేర మాత్రమే నీరు పారుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులు మాని కాళేశ్వరం పంపులను ఆన్ చేసి పంటలను కాపాడాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.