రంగారెడ్డి, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లిలో చెరువుల పరిరక్షణకు అధికార యం త్రాంగం నడుంబిగించింది. మంగళవారం గ్రా మంలో ఆక్రమణకు గురైన తుమ్మల చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేశారు. ఇందులో తుమ్మలచెరువులో ఆక్రమణకు గురైన 35 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని తేల్చేశారు. ఇటీవల ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన చెరువులను కాపాడితే చంపేస్తారా..? అన్న కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ఇబ్రహీంపట్నం ఆర్డీవోతోపాటు ఇరిగేషన్ అధికారులు గ్రామానికెళ్లి తుమ్మలకుంట చెరువు ఆక్రమణపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు మాడ్గుల తహసీల్దార్ ప్రేమ్‌సాగర్, ఇరిగేషన్ డీఈ సమ్మయ్య, ఏఈ మహేశ్, సర్వేయర్లు గ్రామానికెళ్లి తుమ్మలకుంట చెరువును సందర్శించారు. చెరువును సర్వే చేస్తుండగా.. ఈ భూమి తమదంటూ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అధికారుల వద్దకు వచ్చి వాగ్వివాదానికి దిగారు. చెరువు అని రికార్డుల్లో రాస్తే బాగుండదంటూ అధికారులను బెదిరించే యత్నం చేశారు. స్థానికులు జోక్యం చేసుకుని తమ తాతల కాలం నుంచే ఇక్కడ చెరువు ఉందని అధికారులకు వివరించారు. గ్రామానికి చెందిన రైతులంతా అది చెరువే అని చెప్తుండగా.. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం అది చెరువు కాదని, పట్టా భూమి అని వాదించారు. దీంతో భూయజమానులు రైతులకు మధ్య కూడా వాగ్వివాదం జరిగింది. పట్టాదారులు తాము కోర్టుల్లోనే తేల్చుకుంటామని అధికారులను బెదిరించగా.. చెరువులు, కుంటలను అమ్మటం, కొనటం నేరమని అధికారులు స్పష్టం చేశారు.
గిరికొత్తపల్లి గ్రామంలోని తుమ్మలకుంట చెరువులో వివాదాస్పదంగా మారిన 35ఎకరాలు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నది. చెరువు భూమి విక్రయించారని వచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులం కలిసి జాయింట్ సర్వే చేశాం. ఎఫ్టీఎల్లో ఉన్న భూములపై క్రయవిక్రయాలు జరపొద్దు. చెరువును విక్రయించే హక్కు ఎవరికీ ఉండదు.
– సమ్మయ్య, ఇరిగేషన్ డీఈ
గిరికొత్తపల్లి గ్రామంలోని రంగసముద్రం చెరువునూ ఇటీవల కొందరు విక్రయించారు. కొన్న వ్యక్తులు చెరువు తూము, అలుగును ధ్వంసం చేసి కట్టను తొలగించారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు రంగసముద్రం చెరువుపైనా దృష్టిసారించారు. త్వరలోనే అక్కడ కూడా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి తగు చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది.