Yenekepally | మొయినాబాద్, జూలై 09 : ప్రభుత్వ భూములను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తహసిల్దార్. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వాడు ఎవడైనా సరే వదిలి పెట్టేది లేదని ఎమ్మార్వో మరింత దూకుడు పెంచాడు. ప్రభుత్వ పెద్దల నుంచి కూల్చివేతలు ఆపాలని ఒత్తిడి పెరిగిన డోంట్‌కేర్ అనే పద్ధతిలో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడటమే నా ఉద్యోగ ధర్మం అనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఎవడన్నా భూమిని కబ్జా చేయాలన్న తహసీల్దార్ చర్యలతో కబ్జాదారుల వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. గోశాలకు కేటాయించాలని ప్రతిపాదించిన ఎనికెపల్లి భూములు కొంత ఆక్రమణకు గురికావడంతో ఆక్రమణలపై తహసిల్దార్ గౌతమ్ కుమార్ కొరడా ఝులిపించారు. అక్రమంగా ప్రభుత్వ భూముల్లోకి ప్రవేశించి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 120లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఆ భూముల్లో కొంతమంది రైతులు ఏడు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అలాంటి భూములను ప్రభుత్వం గోశాలకు ఇవ్వాలని ప్రతిపాదించింది. రైతులకు కొంత నష్టపరిహారం చెల్లించి ఆ భూములను గోశాలకు కేటాయించే దిశగా ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆ భూములను రైతుల నుంచి తీసుకొనే దిశగా అధికారులు అడుగులు వేస్తుండగా పేదల భూములు గుంజుకోవడం కాదనీ, కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎనికేపల్లి భూ బాధితుల నుండి రెవెన్యూ అధికారుల మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరారు. దీంతో రెవెన్యూ అధికారులు కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టారు.
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు స్వాధీనం
గోశాలకు ఇవ్వాలని ప్రతిపాదించిన ప్రభుత్వ భూమిలో కొంత భాగం కబ్జాకు గురికావడంతో రెవెన్యూ అధికారులు కబ్జాలపై కొరడా ఝులిపించారు. ప్రభుత్వ భూమి ఎనికేపల్లి గ్రామం నుంచి అండాపూర్ గ్రామానికి వెళ్లే అర్ అండ్ బి రోడ్ వరకు ఉంది. రోడ్ పక్కన కొంత మంది పెద్దలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అదే విధంగా భూమి వెనుక భాగంలో రత్నకుమార్ మరియు ఇతర రియల్ వ్యాపారులు కొంత ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలుపుకొని వెంచర్ చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఎనికెపల్లి భూబాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు తహసిల్దార్ గౌతమ్ కుమార్ ఆర్ఐ రాజేష్, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణాలను కూల్చి వేయడంతో పాటు హద్దుబందులు ఏర్పాటు చేసి హద్దులకు ఎర్ర రంగు పోశారు.
నిర్మాణాలు కూల్చవద్దని ప్రభుత్వ పెద్దల ఒత్తిడి
ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేయడంతోపాటు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి కబ్జాదారులు అనుభవిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ కూల్చివేతలు మొదలు పెట్టగా కూల్చివేతలు ఆపాలని ప్రభుత్వ పెద్దల నుంచి జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌కు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. స్థానిక తహసీల్దార్‌కు కాల్ వచ్చిన ప్రభుత్వ భూమిని కాపాడటమే నా ఉద్యోగ ధర్మం అనే పద్ధతిలో తహసీల్దార్ భయపడి వెనుకడుగు వేయకుండా కూల్చివేతల ప్రక్రియ ఆపకుండా నిర్మాణాలను కూల్చివేసి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ పరం చేశారు.
ఎవరిని వదిలి పెట్టేది లేదు : తహసీల్దార్ గౌతం కుమార్
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి వారైన వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వ భూములను కాపాడటం నా ఉద్యోగ ధర్మం. ప్రజలకు సేవ చేయడానికి… ప్రభుత్వ భూములను కాపాడటానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… ఎంత మంది నుంచి ఎన్ని సవాళ్లు వచ్చినా.. ఎవరి నుంచి ఎన్ని ఒత్తిడిలు వచ్చినా భయపడకుండా ప్రభుత్వ భూములను కాపాడటంలో వెనుకడుగు వేసేది లేదని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడితే భవిష్యత్తులో ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఎవరు ప్రభుత్వ భూముల జోలికి వచ్చిన చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.