నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మేకగూడ పీఏసీఎస్ చైర్మన్ మంజూలరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్ భవన పనులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శుక్రవారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్‌తో కలిసి భూమిపూజ చేశారు. అదే విధంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశువుల ధాన కేంద్రం, పశువుల మందుల కేంద్రం, వ్యవసాయ పరికారల విక్రయ కేంద్రం, బ్యాంకు క్యాష్ కౌంటర్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయనికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, సబ్సిడీలు, పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నిజాం పాషా, పీఏసీఎస్ చైర్మన్లు అశోక్, బక్కన్న, డైరెక్టర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోములపద్మారెడ్డి, ఎంపీటీసీ రాజునాయక్, రైతు కోఆర్డినేటర్ మేకంరాజు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి గింజను కొంటాం
షాద్‌నగర్, మే 6 : రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాదగనర్ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనకపోవడంతో పాటు ఎఫ్‌సీఐ తనిఖీల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నింస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న యాదవ్, మాజి మున్సిపల్ చైర్మన్ విశ్వం, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు రైతుబీమా ప్రొసిడింగ్లు అందజేత
అకాల మరణం పొందిన రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన పిల్లి దిలీప్, అన్నారం గ్రామానికి చెందిన టేకులపల్లి కిష్టయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.5లక్షల రైతుబీమా ప్రొసిడింగ్‌లను అందజేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.