బొంరాస్పేట, జూన్ 22 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీ వించే వారి సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. గొల్లకురుమలకు ఉచితంగా గొర్రె పిల్లలను పంపిణీ చేయగా ఆ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం అమ లు చేసిన దళితబంధు, బీసీల బాగు కోసం తీసుకొచ్చిన బీసీ బంధు వంటి సంక్షేమ పథకాల ఊసే కనిపించడంలేదు. అదే దారిలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.
జూన్ నెల దాటుతున్నా ఉచిత చేప పిల్లల పంపిణీ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ప్రతిఏటా ఈ సమయంలోపే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయ్యేది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో మత్స్యకారుల్లో అయోమయం నెలకొన్నది. ఈ పథకం కొనసాగుతుందా..? లేదా అని ఆందోళన చెందుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్ర భుత్వం చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా చేప పిల్లలను వదలడంతో అనేకమంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు.

వికారాబాద్ జిల్లాలో 144 మత్స్య సహకార సంఘాలున్నాయి. వాటిలో 5300 మంది సభ్యులున్నారు. 2016-17లో 18.75 లక్షల చేప పిల్లలను చెరువుల్లో వదలగా.. 2017-18లో 53.41లక్షలు, 2018-19లో 25.99లక్షలు, 2019-20లో 197 చెరువుల్లో 41.54 లక్షలు, 2020-21లో 555 చెరువుల్లో 98.64 లక్షలు, 2021-22లో 691 చెరువుల్లో 1.17 కోట్ల చేప పిల్లలు, 2022-23లో 692 చెరువుల్లో 1.18 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు ఉచితంగా వదిలారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఆదుకున్నది. వర్షాకాలం ప్రారంభమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఉచిత చేప పిల్లల పంపిణీ యథావిధిగా కొనసాగించాలి.
-తిరుపతయ్య, మత్స్య సహకార సంఘం మాజీ డైరెక్టర్, తుంకిమెట్ల
మాజీ సీఎం కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమానికి ఎంతో కృషిచేశారు. ఏటా చెరువుల్లో చేపపిల్లలను ఉచితంగా వదిలి వాటి ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీపై చర్యలు తీసుకోలేదు. పథకం కొనసాగుతుందా..? లేదా అనే అనుమానం మొదలైంది. ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలవాలి.
-లక్ష్మీనారాయణ, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు దుప్చెర్ల