ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14 ; ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారైనా పథకం సక్రమంగా అమలవుతుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయలేదు. కాగా, వానకాల సీజన్ ముగింపునకు వచ్చినా చెరువులు, కుంటల్లో చేపలను ఇంకా వదలకపోవడంతో ఈసారి కూడా అంతేనా..? అనే ఆందోళన మత్స్యకారుల్లో మొదలైంది. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పథకం నిర్విఘ్నంగా కొనసాగింది. కాంగ్రెస్ సర్కారు అవలంబిస్తున్న తీరుతో మత్స్యకారులు ఉపాధికోల్పోతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు కావొస్తున్నా కులవృత్తిదారులకు ప్రోత్సాహం అందించడంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల ముందు కులవృత్తిదారులను ఆదుకుంటామని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో గతేడాదితోపాటు ఈ ఏటా కూడా మత్స్యకారులు ఉపాధి పొందే చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నేటికీ ప్రారంభించకపోవడంతో వారు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వానకాల సీజన్ ముగింపునకు వచ్చినా ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఈసారి కూడా అంతేనా..? అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
మత్స్యకారులకు ఊతమిచ్చిన బీఆర్ఎస్ సర్కారు
గత కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తులకు ఊతం ఇచ్చింది. మత్స్యకారులు ఎదిగేందుకు అన్ని రకాలుగా అండగా నిలిచింది. గతంలో ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా వందశాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలను అందజేసి మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. 2016లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గతేడాది వరకు నిర్విరామంగా కొనసాగింది. ఎనిమిది విడతల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షాలు ప్రారంభమై చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్న సమయంలోనే ఉచిత చేపపిల్లలను వదిలేవారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టింది.
ఉచిత చేపల పిల్లల పంపిణీ పథకంతో ఎంతోమందికి ఉపాధి లభించింది. మత్స్యకారులు ఆర్థికంగా లాభాలు పొందారు. జిలాల్లో 210 మత్స్యకార సంఘాలుండగా..అందులో 15 వేల మంది సభ్యులున్నారు. వీరే కాకుండా సభ్యత్వాలు లేనివారు, పరోక్షంగా మరికొందరికీ ఉపాధి లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా ఉచితంగా చేపపిల్లలను జిల్లాలోని చెరువులు, కుంటల్లో వదలగా మత్స్యకారులు వాటిని పట్టి విక్రయించి ఆర్థికంగా ఎదిగారు. దీంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు వలలు, మార్కెటింగ్ చేసుకునేందుకు ద్విచక్ర వాహనాలను అందించడంతో ఆ కుటుంబాలకు చెందిన యువకులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలోని మత్స్యకారులే కాకుండా అన్ని కుల వృత్తిదారులను ఆదుకోవడంతో రజక, నాయీబ్రాహ్మణ, కమ్మరి, కుమ్మరి, మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు.
చేపపిల్లలను పంపిణీ చేయాలి
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండకుండలను తలపిస్తున్నాయి. నిండిన చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదిలితే వాటి ద్వారా జీవనోపాధి లభిస్తుందని, చేపపిల్లలను పంపిణీ చేయాలని పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించినా ఫలితం లేదని మత్స్యకార సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం చేపపిల్లలను అందించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో వారు ఉపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేప పిల్లలను అందించాలి
ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటినా ఇప్పటికీ ఉచిత చేపపిల్లలను అందించలేదు. ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే ఆ మాటే ఎత్తడంలేదు. ప్రభుత్వం మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రభుత్వం స్పందించి ఉచిత చేపపిల్లలను వాటిలో వదలాలి.
– కిరణ్, మత్స్యకార సంఘం నాయకుడు