వికారాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ పల్లెలుగా రూపుదిద్దుకున్న పంచాయతీల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చెంది అవార్డులను సొంతం చేసుకున్న పల్లెలు ఆరేడు నెలలుగా అస్తవ్యస్థమయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి.
గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తున్నది. గ్రామాల్లో ఐదు నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. ప్రత్యేకాధికారులను నియమించారే తప్ప కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటు పడింది. వేసవి కాలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు ఇవ్వలేదు. పల్లెల్లో చిన్న చిన్న పనులు చేయించిన కాంట్రాక్టర్లకు రూ.4 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు దేశంలోనే ఆదర్శం కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెల పరిస్థితి అధ్వానంగా మారింది. ఆరేడు నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని చిన్న గ్రామ పంచాయతీల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చిన్న గ్రామ పంచాయతీల్లో కార్మికులకు 8 నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం డ్రైనేజీ పైప్‌లైన్ కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొన్నదని పల్లె జనం ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్దంలా మెరిసిన పల్లెల్లోని రోడ్లు… ప్రస్తుతం మురుగు నీటితో దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులకూ డబ్బులు లేక దయనీయ పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు వర్షాలు పడుతుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఇచ్చిన ట్రాక్టర్లు ప్రస్తుతం మూలన పడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేని పరిస్థితితోపాటు కనీసం డీజిల్‌కు కూడా డబ్బులు లేక ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది.
ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే ట్రాక్టర్లు మూలనపడడంతో పల్లెలు అపరిశుభ్రతతో అస్తవ్యస్తంగా మారాయి. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త-చెదారంతో దర్శనమిస్తున్నది. కొన్ని పంచాయతీల్లో అయితే కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలాభివృద్ధికి చేసిన కృషితో 29 గ్రామ పంచాయతీలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను సొంతం చేసుకొని దేశంలోనే ఆదర్శంగా గుర్తింపు పొందిన గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం కళావిహీనంగా మారుస్తున్నది.
జీపీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం..
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అటకెక్కింది. ఏ వీధి చూసినా అస్తవ్యస్థంగా మారింది. ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్త-చెదారమే కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిత్యం రోడ్లు, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయగా రోడ్లు, వీధులు కళకళలాడేవి. ప్రస్తుతం పంచాయతీ కార్మికులకు ఏడెనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదు. పంచాయతీ ట్రాక్టర్లకు ఈఎంఐలు చెల్లించక, ఇటు కార్మికులు శ్రద్ధ చూపక ఇండ్ల మధ్యలోనే డంపింగ్ యార్డులు నెలకొంటున్నాయి.
తూతూ మంత్రంగా స్వచ్ఛదనం-పచ్చదనం..
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా పల్లెల్లో చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం తూతూ మంత్రంగా ముగిసింది. కేవలం ర్యాలీలు, ప్రసంగాలు, ఫొటోల కోసం కొద్దిసేపు రోడ్లను ఊడ్చడం మినహా చేసిందేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. వారం రోజుల పాటు ఎలాంటి ఖర్చు చేయకుండా కార్యక్రమాన్ని ముగించేయడం గమనార్హం. స్థానికంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఫ్లెక్సీలు మొదలుకొని ఇతర ఖర్చుల భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడడంతో ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసవిలో తాగునీటి కోసం పైపులైన్ల మరమ్మతులకు సొంత డబ్బులు పెట్టిన కార్యదర్శులు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ అంటూ మా నెత్తిన మరింత భారం మోపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.